బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల కొనసాగింపుపై తర్జన భర్జన

  • నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్ డ్రైవర్ అఘాయిత్యం
  • స్కూల్ గుర్తింపు రద్దు చేసిన ప్రభుత్వం
  • ఇతర పాఠశాలల్లో పిల్లలను సర్దుబాటు చేయాలని ఆదేశం
  • ప్రత్యేక కమిటీ ద్వారా స్కూల్ ను కొనసాగించాలంటున్న తల్లిదండ్రులు
బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల విషయంలో విద్యా శాఖ అధికారులు ఏం చేయాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్నారు. ఈ పాఠశాలలో ఎల్ కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి వ్యక్తిగత కారు డ్రైవర్ అయిన భీమన రజనీకుమార్ లైంగిక దాడికి పాల్పడడం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, డ్రైవర్ రజనీ కుమార్, ప్రిన్సిపాల్ మాధవిని అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కఠిన చర్యలకు ఆదేశించారు. డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ స్కూల్లో సుమారు 700 మంది విద్యార్థులు చదువుతుండగా, వారు నష్టపోకుండా సమీపంలోని పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని డీఈవోను మంత్రి ఆదేశించారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తమ పిల్లలను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేస్తే విద్య దెబ్బతింటుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులు ప్రభుత్వమే ఒక కమిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా పాఠశాలను నిర్వహించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై విద్యా శాఖ అధికారులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు.


More Telugu News