చివరకు అమరావతే నిలుస్తుంది.. గెలుస్తుంది.. ఇదే ఫైనల్: చంద్రబాబు

  • సరిగ్గా ఏడేళ్ల క్రితం అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీ
  • పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయిందన్న చంద్రబాబు
  • అమరావతి మళ్లీ ఊపిరిపోసుకుంటుందని వ్యాఖ్య
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు నేటితో సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన జరిగిందని చెప్పారు. కనీసం వెయ్యేళ్ల పాటు తెలుగుజాతి గుండె చప్పుడుగా అమరావతి నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని... అయితే, పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

అమరావతి అంటే 28 వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పమని చంద్రబాబు అన్నారు. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారని చెప్పారు. ఎన్నికలకు ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి... అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశాడని జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. అమరావతి రైతుల మహా పాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవని అన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతే అని... అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుందని చెప్పారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని అన్నారు. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుందని, అమరావతే గెలుస్తుందని... ఇదే ఫైనల్ అని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News