ఈ ఫోన్లలో ఇక వాట్సాప్ పనిచేయదు..!

  • ఐఫోన్ ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 వెర్షన్లకు సేవలు నిలిపివేత
  • ఈ నెల 24 నుంచి అమల్లోకి
  • ఆండ్రాయిడ్ 4.1 ముందు నాటి వెర్షన్లకు ఇదే పరిస్థితి
వాట్సాప్ ఇక మీద మరీ పాత కాలం ఆండ్రాయిడ్, ఐవోఎస్ సాఫ్ట్ వేర్ ఆధారిత ఫోన్లలో పనిచేయదు. అక్టోబర్ 24 నుంచి మెస్సేజింగ్ అప్లికేషన్ పనిచేయదంటూ పాత కాలం ఫోన్ యూజర్లను వాట్సాప్ ఇప్పటికే అప్రమత్తం చేస్తోంది. అటు యాపిల్ కూడా ఇదే విషయమై ఐఫోన్ యూజర్లకు సందేశాలు పంపుతోంది. ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 వెర్షన్లకు వాట్సాప్ సపోర్ట్ చేయదు. వీరు కనీసం ఐవోఎస్ 12 వెర్షన్ కు అప్ గ్రేడ్ కావాలి. ఫోన్ మార్చడం లేదంటే కనీసం తాజా ఐవోఎస్ కు అప్ గ్రేడ్ కావడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చు.

ఐఫోన్ 5, ఐఫోన్ 5జీ యూజర్లు తమ ఐవోఎస్ ను అప్ డేట్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ సేవలను పొందొచ్చు. ఇక ఐఫోన్ 4, 4ఎస్ యూజర్లు కొత్త ఫోన్ కు మారిపోవడం మినహా మరో పరిష్కారం లేదు. ఆండ్రాయిడ్ లో అయితే 4.1 వెర్షన్ కు ముందు నాటి ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయదు. కానీ, ఆండ్రాయిడ్ 4.1 ముందు నాటి ఫోన్లు దాదాపు లేవనే చెప్పుకోవాలి. పాత వెర్షన్ ఫోన్లు కొన్ని మినహా ఎక్కువగా ఉండవు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మరింత భద్రమైన సదుపాయాలతో నూతన వెర్షన్లు అందుబాటులోకి వస్తుంటాయి. కనుక వాటికి మారిపోవడమే పరిష్కారం.


More Telugu News