హెల్మెట్ ధరించనందుకు జరిమానా.. ఆధారం ఏదంటూ సోషల్ మీడియాకెక్కిన యువకుడికి పోలీసుల షాకింగ్ రిప్లై!

  • కర్ణాటకలోని బెంగళూరులో ఘటన
  • పోలీసులు పంపిన ఫొటోను షేర్ చేస్తూ ఆధారం లేకుండా జరిమానా చెల్లించబోనన్న యువకుడు
  • పూర్తి ఫొటోను పంపడంతో కంగుతిన్న వైనం
  • తెలుసుకునే హక్కు ఉండడం వల్లే అడిగానంటూ ప్లేటు ఫిరాయింపు
హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన ఓ యువకుడికి పోలీసులు చలానా విధించారు. వారు పంపిన ఫొటోలో తాను హెల్మెట్ ధరించలేదని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదని, కాబట్టి తాను జరిమానా చెల్లించేది లేదంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో చూసిన ట్రాఫిక్ పోలీసులు క్షణాల్లోనే స్పందించారు. మరో ఫొటోను పంపి ఇప్పుడేమంటావ్? అని ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న యువకుడు.. ‘సరేలే కట్టేస్తా’ అంటూ రిప్లై ఇచ్చాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిందీ ఘటన. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు హెల్మెట్ లేకుండా బైక్‌పై దూసుకుపోతున్న ఫొటోను అతడికి పంపిన ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అయితే, ఆ ఫొటోలో నంబరు ప్లేట్ మాత్రమే కనిపిస్తుండడంతో అతడు సోషల్ మీడియాకెక్కాడు. ట్రాఫిక్ పోలీసులు పంపిన ఫొటోలో తాను హెల్మెట్ ధరించలేదని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదని, కాబట్టి తాను జరిమానా చెల్లించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. గతంలోనూ ఇలానే పంపితే పోనీలే అని జరిమానా చెల్లించానని, ఈసారి మాత్రం చెల్లించేది లేదన్నాడు. పూర్తి ఫొటో అయినా పంపాలని, లేదంటే కేసును అయినా వెనక్కి తీసుకోవాలని సూచించాడు

ఈ ట్వీట్ చూసిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే పూర్తి ఫొటో పంపడంతో యువకుడు కంగుతిన్నాడు. ఇది చూసిన యువకుడు పూర్తి ఫొటో పంపినందుకు ధన్యవాదాలు చెబుతూ.. జరిమానా చెల్లిస్తానని పేర్కొన్నాడు. ఓ పౌరుడిగా తెలుసుకునే హక్కు ఉండడం వల్లే ప్రశ్నించానని అన్నాడు. ఆ తర్వాత తొలుత చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. పోలీసులు, యువకుడు మధ్య జరిగిన ట్వీట్ల పోరుపై నెటిజన్లు స్పందించారు. అతడు హెల్మెట్ పెట్టుకోకపోవడమే కాకుండా ఇయర్ ఫోన్స్ ధరించి ఉన్నాడని, కాబట్టి మరింత ఎక్కువ ఫైన్ వేయాలని సూచించారు. పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేసినందుకు అతడిపై ఇంకా జరిమానా వేసే అవకాశం ఉంటే పరిశీలించాలని మరికొందరు కామెంట్ చేశారు.



More Telugu News