ఈ గ్రామంలో సంస్కృతమే మాట్లాడతారు!

  • అసోంలోని పాట్యాలా గ్రామానికి ప్రత్యేకత
  • 2015 నుంచి ఇక్కడ సంస్కృతమే వాడుక భాష
  • పిల్లలు, పెద్దలూ అందరూ సంస్కృతంలోనే మాట్లాడే వైనం
  • ప్రతి నెల గాయత్రి యజ్ఞం
భారతదేశంలో అత్యంత ప్రాచీన భాష సంస్కృతం. ఇప్పుడున్న వివిధ భాషలు సంస్కృత మహావృక్షం నుంచి ఉద్భవించిన శాఖలేనని భాషావేత్తలు చెబుతుంటారు. ప్రస్తుతం సంస్కృతం వేదమంత్రాల రూపంలో వినిపించడమే తప్ప, ఓ వాడుక భాషగా ప్రాచుర్యంలో లేదనే చెప్పాలి. 

కానీ అసోంలోని ఓ గ్రామంలో అచ్చంగా సంస్కృతమే మాట్లాడతారంటే నమ్మశక్యం కాని విషయం. కానీ నమ్మక తప్పదు. ఈ ఊరి పేరు పాట్యాలా. ఈ గ్రామం కరీంగంజ్ జిల్లాలోని రటబారి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ సంస్కృతమే మాట్లాడతారు. 

పాట్యాలా గ్రామాన్ని 'సంస్కృత గ్రామం' అని పిలుస్తారు. ఇక్కడ 2015 నుంచి సంస్కృతమే వాడుక భాషగా కొనసాగుతోంది. ఈ ఊర్లో 60 కుటుంబాలు ఉంటాయి. మొత్తం మీద 300 మంది జనాభా కలిగిన పాట్యాలా సంస్కృత భాషా వినియోగంతో దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. 

ఇక్కడ 2013లో యోగా శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆపై ఇక్కడికి 2015లో సంస్కృత భారతి ప్రచార కార్యకర్తలు రావడంతో గ్రామంలో సంస్కృత వ్యాప్తికి బీజం పడింది. ఈ గ్రామానికి చెందిన దీప్ నాథ్ ఓ యోగా శిక్షకుడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ సంస్కృతిని తదుపరి తరాలకు అందించాలన్నదే తమ ప్రయత్నమని వెల్లడించారు. 

కాగా, ఈ గ్రామంలో సంస్కృతంలో మాట్లాడడమే కాదు, క్రమం తప్పకుండా ప్రతి నెల గాయత్రి యజ్ఞం నిర్వహిస్తారు. ఈ క్రతువులో గ్రామంలోని ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. గ్రామంలోని అత్యధికులు వ్యవసాయదారులే కాగా, 15 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక పాట్యాలా గ్రామాన్ని చూసి పొరుగునే ఉన్న అనిపూర్ బస్తీ ప్రజలు కూడా సంస్కృత భాషలో మాట్లాడడం ప్రారంభించారట.


More Telugu News