చేప గుర్తుకు బదులుగా మరో గుర్తు ముద్రణ.. మునుగోడులో మరో అధికారిపై వేటు

  • మునుగోడు ఎన్నికల్లో ఇప్పటికే రిటర్నింగ్ అధికారిపై వేటు
  • బ్యాెలెట్ పత్రాల ముద్రణలో జరిగిన తప్పుపై సీఈఓ ఆగ్రహం
  • వివరణ ఇవ్వాలంటూ బ్యాలెట్ పత్రాల ముద్రణ అధికారులకు నోటీసులు
మునుగోడు ఉప ఎన్నికల్లో తప్పుల మీద తప్పులు దొర్లుతున్నాయి. అది కూడా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల నుంచే ఈ తప్పులు దొర్లుతుండటం గమనార్హం. ఇప్పటికే కారు గుర్తును పోలి ఉందన్న భావనతో రోడ్డు రోలర్ గుర్తును జాబితా నుంచి తొలగించిన కారణంగా రిటర్నింగ్ అధికారిపై వేటు పడిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్తుల విషయంలోనే జరిగిన మరో తప్పు కారణంగా మరో అదికారిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) శుక్రవారం వేటు వేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం పూర్తి కాగా.. బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైపోయింది. ఇందులో భాగంగా ఓ అభ్యర్థికి చేప గుర్తును కేటాయిస్తే... బ్యాలెట్ పత్రాల ముద్రణలో ఉన్న ఓ అధికారి దానికి బదులుగా మరో గుర్తును ముద్రించారట. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనువెంటనే సదరు తప్పునకు కారణమైన అధికారిని ఎన్నికల విధుల్లో నుంచి తొలగించిన సీఈఓ.. బ్యాలెట్ పత్రాల ముద్రణలో ఉన్న ఇతర అధికారులను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.


More Telugu News