టీ20 వరల్డ్ కప్ లో సంచలనం... రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ ను ఇంటికి పంపిన పసికూన ఐర్లాండ్

  • నేడు గ్రూప్ మ్యాచ్ లో వెస్టిండీస్ ఓటమి
  • 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘనవిజయం
  • సూపర్-12 దశలో ప్రవేశించిన ఐర్లాండ్
  • లీగ్ దశలోనే నిష్క్రమించిన విండీస్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదైంది. పసికూన ఐర్లాండ్ జట్టు నేడు జరిగిన గ్రూప్-బి మ్యాచ్ లో వెస్టిండీస్ ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ఫలితంతో ఐర్లాండ్ సూపర్-12 దశలో ప్రవేశించగా, వెస్టిండీస్ తీవ్ర నిరాశతో ఇంటిముఖం పట్టింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండుసార్లు టైటిల్ గెలిచిన విండీస్ ఈసారి దారుణ ఆటతీరుతో తగిన మూల్యం చెల్లించుకుంది. 

హోబర్ట్ లో జరిగిన నేటి మ్యాచ్ వివరాలను పరిశీలిస్తే... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ 62 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో డెలానీ 3 వికెట్లు తీశాడు. 

అనంతరం, ఓ మోస్తరు లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ అదరగొట్టింది. కేవలం ఒక వికెట్ నష్టపోయి 17.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. సీనియర్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఆండ్రూ బాల్ బిర్నీ 37 పరుగులు చేశాడు. వన్ డౌన్ లో వచ్చిన లోర్కాన్ టకర్ 35 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. 

ఐర్లాండ్ జట్టు ఇప్పటిదాకా 7 పర్యాయాలు టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనగా, తొలి దశను అధిగమించడం ఇది రెండోసారి. నేటి మ్యాచ్ లో ఓటమితో ఈ టోర్నీలో వెస్టిండీస్ కథ ముగిసింది. 2012, 2016లో టీ20 వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచిన విండీస్ ఈసారి లీగ్ దశలోనే నిష్క్రమించింది. తానాడిన మూడు మ్యాచ్ ల్లో ఒక్కదాంట్లో నెగ్గి, రెండు పరాజయాలు మూటగట్టుకుంది.


More Telugu News