అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసిన హైకోర్టు

  • పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలి
  • పాదయాత్రలో నాలుగు వాహనాలను మాత్రమే వినియోగించాలి
  • పోటీ నిరసనలు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదే
అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. పాదయాత్రలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. తాము ఇచ్చిన ఆదేశాలకు లోబడే పాదయాత్రను కొనసాగించాలని స్పష్టం చేసింది. పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని తెలిపింది. 

పాదయాత్రకు సంఘీభావం తెలపాలనుకునేవారు రోడ్డు పక్కనే ఉండి తెలపాలని చెప్పింది. పాదయాత్రలో నాలుగు వాహనాలను మాత్రమే వినియోగించాలని తెలిపింది. కోర్టు అనుమతించిన వారు తప్ప ఇతరులు పాదయాత్రలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. పాదయాత్రకు పోటీగా ఇతరుల నిరసనలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత, ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని హైకోర్టు తెలిపింది.


More Telugu News