అమరావతి భూములను దిగమింగేందుకే సీఆర్‌డీఏ చట్టానికి మార్పులు: టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు

  • రాజధాని భూముల్లో ఇళ్ల పట్లాలను ఇవ్వడాన్ని కోర్టులు తప్పుపట్టాయన్న సాంబశివరావు
  • చట్టాలను ప్రభుత్వం ఇష్టానుసారం సవరిస్తోందని మండిపాటు
  • ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మానుకోకపోతే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వ్యాఖ్య
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరించిన భూములను దిగమింగేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలను ఇవ్వడాన్ని ఇప్పటికే న్యాయస్థానాలు తప్పుపట్టాయని... అయినప్పటికీ, దొడ్డిదారిలో ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని అన్నారు. సీఆర్డీయే, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ చట్టాలకు ఇష్టానుసారం సవరణను చేస్తూ రాజధాని నిర్మాణ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని విమర్శించారు. అమరావతిలో ఎలాంటి అభివృద్ధి పనులను చేయకపోగా... ఆ భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. మాస్టర్ ప్లాన్ లో మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. 

న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలను ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. ప్రజాప్రయోజనాల కోసం చేయాల్సిన చట్టాలను భూదాహాన్ని తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. 500 ఎకరాలను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కోర్టు కొట్టేసినా... జగన్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతోందని చెప్పారు. సీఎం జగన్ ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మానుకోవాలని సూచించారు. లేకపోతే వచ్చే ఎన్నికల తర్వాత వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు.


More Telugu News