న్యూయార్క్ లో దీపావళి సందర్భంగా పబ్లిక్ హాలిడే

  • 2023 నుంచి అమలుకు నిర్ణయం
  • స్కూల్ కేలండర్ లో యానివర్సరీ డే స్థానంలో చోటు
  • ప్రకటించిన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్
దీపావళి పండుగకు న్యూయార్క్ లోనూ ప్రాముఖ్యత దక్కింది. 2023 నుంచి దీపావళిని పబ్లిక్ హాలిడే గా (అధికారిక సెలవు దినం) పట్టణ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న దీనిపై తగిన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తద్వారా న్యూయార్క్ పట్టణ ఏకత్వంపై సందేశం ఇచ్చినట్టు అయిందన్నారు. పిల్లలు దీపావళి గురించి నేర్చుకునేందుకు ప్రోత్సాహం ఇస్తుందన్నారు. స్కూల్ కేలండర్ లోని యానివర్సరీ డేను దీపావళి కోసం కేటాయించారు. యానివర్సరీ డేను ఏటా జూన్ మొదటి గురువారం అక్కడ నిర్వహిస్తుంటారు. 

‘‘భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నుంచి ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ ఇది. దీపావళిని పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం న్యూయార్క్ పట్టణ వైవిధ్యం, బహుళత్వానికి బలమైన సందేశం ఇచ్చినట్టు అవుతుంది. అన్ని వర్గాల ప్రజలు సంబరాలు చేసుకోవడానికి, భారతీయ తత్వం, వారసత్వాన్ని అనుభవించడానికి అవకాశం కల్పిస్తుంది’’ అని న్యూయార్క్ కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. న్యూయార్క్ లోని హిందూ, బుద్ధిస్ట్, సిఖ్, జైన్ మతాలకు చెందిన 2 లక్షల మంది దీపావళి వేడుకలను గుర్తించే సమయం ఆసన్నమైనట్టు న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు జెనీఫర్ రాజ్ కుమార్ ప్రకటించారు. 



More Telugu News