10 కోట్ల కరోనా డోసులు వృథా: అదర్ పూనావాలా

  • వ్యాక్సిన్ వేసుకోవడంపై జనం విముఖత
  • కరోనాతో ప్రజలు విసుగెత్తిపోయారన్న సీరం కంపెనీ సీఈవో
  • తనకూ విసుగ్గానే ఉందన్న పూనావాలా
  • కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి ఆపేసినట్లు వివరణ
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్ పడిపోయిందని సీరమ్ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడానికి జనం విముఖత చూపుతుండడంతో తమ కంపెనీ టీకాలు దాదాపు 10 కోట్ల డోసులు వృథా అయ్యాయని ఆయన వివరించారు. గతేడాది డిసెంబర్ లోనే కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి ఆపేశామని తెలిపారు. ఈమేరకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వ్యాక్సిన్ తయారీదారుల నెట్ వర్క్ సమావేశంలో భాగంగా పూనావాలా విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో వ్యాక్సిన్లకు చాలా డిమాండ్ ఉండేదని ఆయన చెప్పారు. వైరస్ వేవ్ ల నేపథ్యంలో భారతీయులతో పాటు ఇతర దేశాలకూ పంపించే ఉద్దేశంతో వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేశామని చెప్పారు. సెకండ్ డోసు తీసుకున్న తర్వాత ప్రజలు బూస్టర్ డోసు తీసుకోవడానికి కొంత విముఖత చూపిస్తున్నారని వివరించారు. బూస్టర్ డోసు విషయంలో ప్రభుత్వం పలు మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

మొదటి, రెండో డోసుగా ఇతర కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ బూస్టర్ డోసుగా ఏ కంపెనీ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ సూచించిందన్నారు. అయినప్పటికీ కరోనా విషయంలో, వ్యాక్సిన్లు తీసుకోవడంపైనా జనం విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. వాస్తవానికి తనకూ వీటిపై విసుగ్గానే ఉందని పూనావాలా వ్యాఖ్యానించారు. 

ఈ నేపథ్యంలో మార్కెట్లో కరోనా వ్యాక్సిన్లకు డిమాండ్ తగ్గిపోయిందని, ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లతో గోడౌన్లు నిండిపోయాయని వివరించారు. గతేడాది డిసెంబర్ నాటికి సీరమ్ కంపెనీ దగ్గర కొవిషీల్డ్ వ్యాక్సిన్లు పెద్ద మొత్తంలో నిల్వ ఉండిపోవడంతో వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆపేశామని తెలిపారు. అప్పటికే సుమారు 10 కోట్ల కొవిషీల్డ్ డోసులు ఎక్స్ పైరీ అయ్యాయని అదర్ పూనావాలా వివరించారు.


More Telugu News