ఆసుపత్రిలో వైద్యులతో జయలలిత మాట్లాడిన ఆడియో లీక్

  • జయలలిత మరణం చుట్టూ అనేక అనుమానాలు
  • అర్ముగస్వామి కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత వెలుగులోకి ఆడియో
  • ఎప్పుడు? ఎవరు? రికార్డు చేశారన్న దానిపై అయోమయం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన వార్తలు ఇటీవల మళ్లీ వరుసగా వెలుగులోకి వస్తూ సంచలనం రేపుతున్నాయి. జయలలిత 2016 డిసెంబరు 5న కన్నుమూశారు. అప్పటి నుంచి ఆమె మరణం చుట్టూ అనేక అనుమానాలు అల్లుకున్నాయి. జయ మరణం, అందుకు దారితీసిన పరిస్థితులపై అసలు విషయాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు అప్పటి తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ఏర్పాటు చేసింది. 

ఆ కమిషన్ రూపొందించిన నివేదిక ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి చేరింది. దీంట్లో అత్యంత ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఆ తర్వాతి నుంచి జయ మృతికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఆసుపత్రిలో జయలలిత మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది. 

ఆ ఆడియో ప్రకారం..
జయలలిత: బీపీ ఎలా ఉంది అర్చనా?
అర్చన: 140/80గా ఉంది
జయలలిత: అంటే సాధారణమే కదా
ఆ తర్వాత వ్యక్తిగత వైద్యుడు శివకుమార్‌కు, జయలలితకు మధ్య సంభాషణ ఇలా సాగింది
జయలలిత: సరిగ్గా రికార్డు చేస్తున్నారా?
శివకుమార్: వీఎల్‌సీ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేస్తున్నాను
జయలలిత: మీరు కూడా ఒకటి చేయబోయి మరోటి చేస్తున్నారు. డౌన్‌లోడ్‌ కాకుంటే వదిలేయండి. నేను మాట్లాడేది సరిగా రికార్డు అవుతోందా?
శివకుమార్: లేదు (ముక్తసరిగా)
జయలలిత: ఎందులో రికార్డు చేస్తున్నారు?
శివకుమార్: వీఎల్‌సీలో రికార్డు చేస్తున్నా

జయలలితకు, వారికి మధ్య సంభాషణ ఇలా సాగింది. అయితే, ఈ ఆడియోను ఎవరు? ఎందుకు? రికార్డు చేశారన్న వివరాలు బయటకు రాలేదు. అయితే, అర్ముగస్వామి కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత ఈ ఆడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.


More Telugu News