జనసేనతో కలిసి పోరాటం చేస్తాం: నారా లోకేశ్

  • ఇటీవల వైసీపీ నేతలపై విరుచుకుపడిన పవన్
  • పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న లోకేశ్
  • ప్రజా సమస్యలపై పోరాడడం తప్పు ఎలా అవుతుందన్న టీడీపీ అగ్రనేత
ఇటీవల మంగళగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగేలా ప్రసంగించడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటమే తప్పా? అని ప్రశ్నించారు. 

మహిళల్ని అగౌరవపరుస్తూ వైసీపీ నేతలు మాట్లాడినప్పుడు సీఎం చర్యలు తీసుకోకపోగా... నవ్వుతూ ఎంజాయ్ చేశారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన కలిసి ప్రజా సమస్యలపై పోరాడతాయని పేర్కొన్నారు. 

అటు, విశాఖ దసపల్లా భూముల కుంభకోణంపైనా లోకేశ్ స్పందించారు. విశాఖలో ఎంపి ఎంవీవీ, విజయసాయిరెడ్డి మధ్య వాటాల్లో తేడా వచ్చింది కాబట్టే భూ కుంభకోణాలు బయటపెట్టుకున్నారని తెలిపారు. దసపల్లా భూములపై సీబీఐ ఎంక్వయిరీ వేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. 

ఇక, జగన్ కోరిక, డిమాండ్ల మేరకే తాము అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని లోకేశ్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన మాట తప్పి, మడమ తిప్పాడని అన్నారు. ఎన్నికల ముందు ఇక్కడే రాజధాని అన్న కరకట్ట కమల్ ఇప్పుడు ఇక్కడ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ది చేతగాక మూడు రాజధానులు అని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఓ వైసీపీ ఎంపీ అమరావతి రైతులకు చెప్పు చూపించి దాడి చేయించాడు... ఆ ఎంపీకి ఒళ్లు బలిసింది అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చెయ్యాలి అనుకుంటే నాడు చంద్రబాబు గారిపై మాట్లాడిన మాటలకు జగన్ హైదరాబాద్ నుండి ఆంధ్రాలో అడుగు పెట్టేవాడా? పాదయాత్ర చెయ్యగలిగేవాడా? అని నిలదీశారు. రైతులను అవమానించిన వారికి శాపం తగలడం ఖాయమని పేర్కొన్నారు.


More Telugu News