నిరుద్యోగులకు తీపి కబురు చెప్పిన జగన్ సర్కారు
- పోలీసు శాఖలో 6,511 పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
- సివిల్ పోలీసింగ్ లో 3,580 కానిస్టేబుల్, 315 ఎస్ఐ పోస్టుల భర్తీకి నిర్ణయం
- రిజర్వ్ పోలీసు విభాగంలో 2,520 కానిస్టేబుల్ పోస్టులు, 96 ఎస్ఐ పోస్టుల భర్తీ
- ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ ముఖ్య కార్యదర్శి
- త్వరలోనే విడుదల కానున్న నోటిఫికేషన్
ఏపీలో నిరుద్యోగులకు వైసీపీ సర్కారు గురువారం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 6,511 పోస్టులను భర్తీ చేసేందుకు జగన్ సర్కారు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీని త్వరితగతిన చేపట్టాలంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... పోస్టుల భర్తీకి హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.
హోం శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... రాష్ట్ర పోలీసు శాఖలోని సివిల్ పోలీసింగ్, రిజర్వ్ పోలీసు శాఖల్లో ఉన్న 6,511 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ పోస్టులతో పాటు సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయి. సివిల్ పోలీసింగ్ లో 3,580 కానిస్టేబుల్ పోస్టులు, 315 ఎస్ఐ పోస్టులు భర్తీ కానున్నాయి. రిజర్వ్ పోలీసు విభాగంలో భాగంగా ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్ పోస్టులు, 96 ఎస్ఐ పోస్టులు భర్తీ కానున్నాయి.