అభివృద్ధి చేసే గుర్తు కారు... అమ్ముడుబోయిన గుర్తు కమలం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

  • మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
  • బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపణ
  • అమ్ముడుబోయిన రాజగోపాల్ రెడ్డిని తరిమికొట్టాలని పిలుపు
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గురువారం మునుగోడు పరిధిలోని చౌటుప్పల్ మండలం నాగారంలో జరిగిన టీఆర్ఎస్ ప్రచారానికి హాజరైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. 

అభివృద్ధి చేసే గుర్తు కారు అయితే... అమ్ముడుబోయిన గుర్తు కమలం గుర్తు అని ఆయన సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది సీఎం కేసీఆరేనన్న మంత్రి... డబ్బుకు అమ్ముడుబోయిన నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలిచారని విమర్శించారు. అమ్ముడుబోయిన రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. 2011లో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి ఎలా ఎన్నికల గుర్తుగా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ గుర్తును తీసివేసిన కారణాన్ని చూపుతూ ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు సబబు కాదన్నారు. రిటర్నింగ్ అధికారిని మార్చిన ఈసీ వైఖరి అభ్యంతరకరమన్నారు. చైతన్యవంతులైన మునుగోడు ప్రజలు అన్ని పరిణామాలను గమనిస్తున్నారన్న ప్రశాంత్ రెడ్డి... ఎన్నికల్లో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని తెలిపారు.


More Telugu News