ఇగో వద్దు జగన్ రెడ్డీ... ఇష్యూని సాల్వ్ చేయండి!: చంద్రబాబు

  • రోడ్డు నిర్మాణం కోసం నీటిలో దిగిన చిన్నారులు
  • చేతులెత్తి నమస్కరిస్తూ ప్రభుత్వానికి విన్నపం
  • పత్రికలో కథనం.. స్పందించిన చంద్రబాబు
'సీఎం సారూ... మా ఊరికి రోడ్డు వేయించండి' అంటూ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో చిన్న పిల్లలు నీటిలో దిగి చేతులెత్తి నమస్కరిస్తున్న ఓ పత్రికా కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. 

ప్చ్... ఈ ముఖ్యమంత్రికి ఎలా చెబితే అర్థమవుతుందో ఎవరికీ అర్థంకావడంలేదని విమర్శించారు. రాష్ట్రంలో చివరికి చిన్నపిల్లలు సైతం వంతెన అప్రోచ్ రోడ్డు కోసం నిరసనల బాట పట్టే పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించారు. 

నర్సీపట్నంలో వరాహ నదిపై టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ లో ఉన్న ఆ కాస్త అప్రోచ్ రోడ్డు పనులు పూర్తిచేయలేదని ఆరోపించారు. దీంతో, మోడల్ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారని చంద్రబాబు వివరించారు. 

ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏమీ కట్టలేరని ప్రతి ఒక్కరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను పూర్తిచేసినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. "ప్రజా సమస్యలపై ఇగో వద్దు జగన్ రెడ్డీ... ఇష్యూని సాల్వ్ చేయండి" అంటూ చంద్రబాబు హితవు పలికారు.


More Telugu News