రిటర్నింగ్ అధికారిని తప్పించిన ఈసీ చర్యను తప్పుబట్టిన కేటీఆర్

  • రోడ్డు రోలర్ గుర్తు తొలగింపు వ్యవహారంలో రిటర్నింగ్ అధికారిపై వేటు
  • ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్న కేటీఆర్
  • తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును 2011లోనే తొలగించారని వెల్లడి
  • తొలగించిన గుర్తును తిరిగి ఎలా ప్రవేశపెడతారంటూ ఆగ్రహం
  • రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ
మునుగోడు రిటర్నింగ్ అధికారిపై వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం చర్యను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీ వ్యవహారంలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ఏ రీతిన దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి కేటాయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనని కూడా ఆయన అన్నారు.

గతంలో తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును ఎన్నికల సంఘం తొలగించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఒకసారి రద్దు చేసిన గుర్తును తిరిగి మరోమారు ఆ గుర్తును ఎన్నికల్లోకి ప్రవేశపెట్టడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. తమ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తులతో ఓటర్లను అయోమయానికి గురి చేసి దొడ్డిదారిన లబ్ధి పొందేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అధికారిని బదిలీ చేసిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు.


More Telugu News