అవమానం నుంచి తేరుకొని టీ20 ప్రపంచ కప్ లో అందరికంటే ముందే సూపర్12 చేరిన శ్రీలంక

  • తొలి మ్యాచ్ లో నమీబియా చేతిలో ఓటమి పాలైన మాజీ చాంపియన్
  • తర్వాత వరుసగా రెండు విజయాలతో ముందుకు
  • గ్రూప్–ఎ మూడో మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను ఓడించిన లంక
  • సత్తా చాటిన కుశాల్ మెండిస్, బౌలర్లు 
పసికూన నమీబియా చేతిలో ఘోర పరాజయంతో టీ20 ప్రపంచకప్ ను మొదలు పెట్టిన శ్రీలంక తర్వాత గొప్పగా పుంజుకుంది. వరుసగా రెండు విజయాలతో అందరికంటే ముందే సూపర్ 12 రౌండ్ కు అర్హత సాధించింది. గురువారం జరిగిన గ్రూప్–ఎ లో శ్రీలంక 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను ఓడించి ముందంజ వేశారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక 162/6 స్కోరు చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79) అర్ధ సెంచరీతో సత్తా చాటగా.. చరిత్ అసలంక (31) కూడా రాణించాడు. 

నెదర్లాండ్స్ బౌలర్లలో వాండర్ మెర్వే, లీడె చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఓవర్లన్నీ ఆడి 146/9 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. మాక్స్ ఒడౌడ్ (53 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71) అజేయ అర్ధ శతకం చేసినా ఫలితం లేకపోయింది. లంక బౌలర్లలో వానిందు హసరంగ మూడు, మహేశ్ తీక్షణ రెండు వికెట్లతో సత్తా చాటారు. కుశాల్ మెండిస్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


More Telugu News