గీతా ఆర్ట్స్ లో 'కాంతార' హీరో .. సక్సెస్ మీట్ లో చెప్పిన అల్లు అరవింద్

  • ఈ నెల 15న తెలుగులో విడుదలైన 'కాంతార'
  • భారీ వసూళ్లను రాబడుతున్న సినిమా 
  • సక్సెస్ మీట్ ను నిర్వహించిన టీమ్ 
  • గీతా ఆర్ట్స్ లో రిషబ్ శెట్టి చేయనున్నాడన్న అల్లు అరవింద్ 
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన 'కాంతార' సినిమాను, తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేశారు. ఈ నెల 15వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబడుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "ఈ సినిమా రిలీజ్ కి ముందు 'ఒకసారి చూడండి' అని చెప్పడానికి మీ ముందుకు వచ్చాము .. ఈ స్థాయిలో ఆదరించిన మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇప్పుడు వచ్చాము. సినిమాకి ఎమోషన్ తో తప్ప భాషతో సంబంధం లేదని 'కాంతార' మరోసారి నిరూపించింది" అన్నారు. 

ఈ కథ మట్టిలో నుంచి పుట్టింది. ఇంగ్లిష్ సినిమా చూసో .. యూరోపియన్ సినిమాను చూసో .. కొరియన్ సినిమా చూసో చేసింది కాదు. తన ఊర్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రిషబ్ శెట్టి ఈ కథను తయారు చేసుకుని తీశాడు. ఆయన అనుభవించిన ఎమోషన్ ను స్వయంగా ఆవిష్కరించడం వలన ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అయింది. ఇది మన సింహాచలానికి దగ్గరగా ఉన్న కథ అనిపించింది. అజనీశ్ లోకనాథ్ ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. ఆయన ఎంతలా రీసెర్చ్ చేశాడనేది తెలుసుకుని షాక్ అయ్యాను" అని చెప్పారు. 

"ఈ సినిమాను కన్నడలో చూసి పరిగెత్తుకుని నా దగ్గరికి వచ్చి బన్నీ వాసు చెప్పడం వల్లనే నేను చూశాను. సినిమాలోని ఎమోషన్ కి నేను కనెక్ట్ కావడం వల్లనే ఇక్కడ రిలీజ్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ చూసిన వెంటనే గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేయమని అడిగాను .. ఆయన ఒప్పుకున్నాడు కూడా" అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపాన్ని దాల్చుతుందనేది చూడాలి. 


More Telugu News