బ్రిటన్‌లో పెరిగిపోతున్న జీవన వ్యయం.. భోజనం మానేస్తున్న లక్షలాదిమంది!

  • విద్యుత్ చార్జీలను ఫ్రీజ్ చేసిన కొత్త ప్రధాని
  • ఆరోగ్యకరమైన భోజనానికి దూరమవుతున్న లక్షలాదిమంది ప్రజలు
  • ధరల పెరుగుదల కారణంగా 10 శాతానికి పైగా పెరిగిన ద్రవ్యోల్బణం
  • దాదాపు 80 శాతం మంది ప్రజలు సంక్షోభంలో ఉన్నారన్న కన్జుమర్ గ్రూప్
బ్రిటన్ ప్రజలు క్రమంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా జీవన వ్యయం పెరిగిపోతుండడంతో దాని నుంచి గట్టెక్కేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కుటుంబాలను కాపాడుకునేందుకు చేస్తున్న భోజనాల సంఖ్యను కుదిస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమవుతున్నట్టు కన్జుమర్ గ్రూప్ ‘విచ్’ పేర్కొంది. 

బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన తర్వాత విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేశారు. అయితే, ఈ నిర్ణయం ప్రజలను ఇంధన పేదరికంలోకి నెట్టేస్తుందన్న హెచ్చరికలు వినిపించాయి. మరోవైపు, ఆహార ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం 10 శాతం కంటే పైకి ఎగబాకింది. జీవన వ్యయం ఒక్కసారిగా పెరిగిపోవడంతో దాదాపు సగం మంది యూకే ప్రజలు తాము తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారని, తీసుకునే భోజనాల సంఖ్యను తగ్గిస్తున్నారని ‘విచ్’ తెలిపింది. 3 వేల మందిపై జరిపిన సర్వే అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది.

సంక్షోభానికి ముందుతో పోలిస్తే దాదాపు 80 శాతం మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవన వ్యయ సంక్షోభం ప్రజలపై వినాశకర ప్రభావాన్ని చూపిస్తుందని ‘విచ్’ ఫుడ్ పాలసీ హెడ్ స్యూ డేవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. మిలియన్ల మంది ఒక పూట భోజనాన్ని దాటవేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ఆరోగ్యకరమైన భోజనాన్ని దూరం చేస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వేడిగా ఉంచుకోలేకపోతున్నారని కన్జుమర్ గ్రూప్ పేర్కొంది.


More Telugu News