వేలానికి కింగ్‌ చార్లెస్ వివాహం నాటి కేకు ముక్క.. రూ. 27 వేల నుంచి వేలం మొదలు

  • 41 సంవత్సరాల క్రితం కింగ్ చార్లెస్-డయానా దంపతుల వివాహం
  • ఆ సమయంలో 43 కేకులను కట్ చేసిన చార్లెస్ దంపతులు
  • ఫ్రూట్ కేకులో ముక్కకు తాజాగా వేలం
బ్రిటన్ రాజుగా ఇటీవల పగ్గాలు చేపట్టిన కింగ్ చార్లెస్ III, యువరాణి డయానా దంపతుల వివాహం నాటి కేకు ముక్క వేలానికి సిద్ధమైంది. 1981లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి హాజరైన వారిలో నిగెల్ రికెట్స్ గతేడాది మరణించారు. ఆయనకు సంబంధించి తాజాగా ఓ విషయం బయటపడింది. కింగ్ చార్లెస్ వివాహానికి హాజరైన ఆయన ఆ సందర్భంగా కట్ చేసిన కేకు ముక్కను 41 ఏళ్లుగా భద్రపరిచారు. ఇప్పుడీ కేకు ముక్కను వేలం వేయాలని డోర్ అండీ రీస్ సంస్థ నిర్ణయించింది. వేలం 300 పౌండ్లు.. మన కరెన్సీలో దాదాపు రూ. 27 వేలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

ఈ కేకు ముక్కకు భారీ ధర పలికే అవకాశం ఉందని ‘న్యూయార్క్ పోస్ట్’ తెలిపింది. 41 సంవత్సరాల క్రితం కేకును ఎలాగైతే ప్యాక్ చేసి విక్రయించారో ఈ ముక్కను కూడా అలాగే ప్యాక్ చేసి వేలం వేయనున్నారు. అప్పట్లో కింగ్ చార్లెస్ దంపతులు తమ వివాహం సందర్భంగా మొత్తం 43 కేకులు కట్ చేశారు. వేలానికొచ్చిన ఈ కేకు ముక్క ఫ్రూట్ కేకులోనిదని గుర్తించారు. కాగా, చార్లెస్ దంపతుల వివాహానికి సంబంధించిన ఓ కేకు ముక్కను 2014లో ఇదే సంస్థ వేలం వేసింది. అప్పట్లో దానికి భారత కరెన్సీలో రూ. 1.27 లక్షలు పలికింది.


More Telugu News