133 మందిని బలిగొన్న ఆ స్టేడియంను కూల్చేస్తాం.. ప్రకటించిన ఇండోనేషియా అధ్యక్షుడు

  • భద్రతా ప్రమాణాలతో తిరిగి నిర్మిస్తామన్న అధ్యక్షుడు
  • అధ్యక్షుడితో భేటీ అయిన ఫిఫా అధ్యక్షుడు
  • వచ్చే ఏడాది అండర్-20 ప్రపంచకప్
ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా తొక్కిసలాట జరిగి 133 మంది మృతికి కారణమైన ఇండోనేషియా జావా ప్రావిన్స్‌లోని కంజురుహాన్ స్టేడియాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడు జోకో విడోడో నిన్న ప్రకటించారు. స్టేడియంను కూల్చివేసి దాని స్థానంలో అన్ని భద్రతా ప్రమాణాలతో తిరిగి నిర్మిస్తామని తెలిపారు. దేశంలో వచ్చే ఏడాది అండర్-20 ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో స్టేడియం కూల్చివేత ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, అధ్యక్షుడు విడోడోతో భేటీ అయిన ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో మాట్లాడుతూ.. దేశంలో ఫుట్‌బాల్‌ను సంస్కరించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

తొక్కిసలాటలో 133 మంది మరణించిన ఆ రోజును ఫుట్‌బాల్ చరిత్రలోనే చీకటి రోజుల్లో ఒకటిగా అభివర్ణించిన ఆయన.. ఫిఫా ప్రమాణాలతో నిర్మించే స్టేడియంలో ప్రేక్షకులు, క్రీడాకారుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇండోనేషియాలో ఫుట్‌బాల్‌ను సంస్కరిస్తామని, మ్యాచ్‌ల నిర్వహణలో మార్పులు తీసుకొస్తామని అన్నారు. వచ్చే ఏడాది మే-జూన్ మధ్య జరిగే అండర్-20 ప్రపంచకప్‌ సురక్షితంగా సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుండడంతో అప్పటి వరకు దేశంలో అన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు.


More Telugu News