ఆ 8 గుర్తులను తొలగించండి...ఈసీకి టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ వినతి

  • మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన 8 గుర్తులు
  • వాటిని జాబితా నుంచి తొలగించాలంటున్న టీఆర్ఎస్
  • ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన వైనం
  • తాజాగా ఈసీ అధికారులను స్వయంగా కలిసిన వినోద్ కుమార్
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను తొలగించే దిశగా ఆ పార్టీ చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ లేఖ రాసింది. అయితే ఆ లేఖపై ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైన నేపథ్యంలో తాము కలగజేసుకోలేమంటూ హైకోర్టు చెప్పడంతో తాజాగా టీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది.

టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచిన విషయాన్ని ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే తమ పార్టీ అభ్యర్థికి నష్టం జరుగుతుందని ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. ఈ నేపథ్యంలో కారును పోలిన ఆ 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.


More Telugu News