మళ్లీ తిరిగొస్తారో రారో అని అనుమానం... భారత రెజ్లర్లకు వీసాలు నిరాకరించిన స్పెయిన్ ఎంబసీ

  • స్పెయిన్ లో అండర్-23 రెజ్లింగ్ టోర్నీ
  • 45 మందిని పంపించాలని భావించిన భారత రెజ్లింగ్ సమాఖ్య
  • భారత రెజ్లర్లు స్పెయిన్ లోనే ఉండిపోతారని భావించిన స్పెయిన్ ఎంబసీ
భారత రెజ్లర్లు ఇటీవల కాలంలో ప్రపంచస్థాయి పోటీల్లో అనేక పతకాలు గెలుస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. స్పెయిన్ లో నిన్న అండర్-23 రెజ్లింగ్ వరల్డ్ చాంపియన్ షిప్ ప్రారంభం కాగా, ఈ టోర్నీలోనూ మనవాళ్ల హవా కొనసాగుతుందని అందరూ భావించారు. అయితే, ఈ టోర్నీలో పాల్గొనేందుకు పలువురు భారత రెజ్లర్లకు అవకాశం లేకుండా పోయింది. అందుకు కారణం స్పెయిన్ దౌత్య కార్యాలయమే!

అక్టోబరు 23 వరకు ఈ రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీలు జరగనుండగా, టోర్నీ ముగిసిన తర్వాత కూడా భారత రెజ్లర్లు స్పెయిన్ లోనే ఉండిపోతారన్న అనుమానంతో ఢిల్లీలోని స్పెయిన్ ఎంబసీ వీసాలు నిరాకరించింది. గత ఆరేళ్లలో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్ పాల్గొనకపోవడం ఇదే మొదటిసారి. 

ఈ చాంపియన్ షిప్ ఈశాన్య స్పెయిన్ లోని పాంటేవెద్రా నగరంలో జరుగుతున్నాయి. ఈ పోటీల కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య 45 మందితో భారీ బృందాన్ని పంపించాలని నిర్ణయించింది. 

అయితే స్పెయిన్ దౌత్య కార్యాలయ సిబ్బంది ఆలోచనలు మరోలా ఉన్నాయి. వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి ఉద్దేశాలు, పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయన్న కారణంతో వీసాలు ఇవ్వలేకపోతున్నామని స్పానిష్ ఎంబసీ అధికారులు తెలిపారు. వారు పరిమితికి మించి ఎక్కువరోజుల పాటు స్పెయిన్ లోనే తిష్టవేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 

కాగా, భారత రెజ్లర్ల బృందంలో 9 మందికి మాత్రం వీసాలు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. వీసాలు లభించనివారిలో అండర్-20 మహిళల రెజ్లింగ్ చాంపియన్ అంతిమ్ పంఘాల్, పురుషులు 74 కిలోల వరల్డ్ కేడెట్ చాంపియన్ సాగర్ జగ్లాన్, ఆసియా కేడెట్ పోటీల కాంస్య పతక విజేత రీతికా హుడా, మహిళల జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ రజత పతక విజేత భటేరీ తదితరులు ఉన్నారు.


More Telugu News