ఏకరీతి గుర్తులను కేటాంచవద్దన్న టీఆర్ఎస్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

  • కారును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దన్న టీఆర్ఎస్
  • ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేసిన వైనం
  • మొత్తం 8 గుర్తులను ప్రస్తావించిన అధికార పార్టీ
  • ఎన్నికల ప్రక్రియ మొదలైనందున జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
మునుగోడు ఉప ఎన్నికల ముందు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. తన ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలన్న టీఆర్ఎస్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో తమ గుర్తు కారును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం ద్వారా తమకు నష్టం జరుగుతోందని, ఈ విషయంలో ఇప్పటికే పలు ఎన్నికల్లో తమకు నష్టం జరిగిందని, తాజా ఉప ఎన్నికల్లో అయినా తమ గుర్తును పోలిన గుర్తులను ఇతరులకే కేటాయించరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ కోరిన సంగతి తెలిసిందే. ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా తమ పార్టీ గుర్తు కారును పోలినట్టుండే... కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు పెట్టె, టీవీ, కుట్టు మిషన్, ఓడ గుర్తులను మునుగోడు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని టీఆర్ఎస్ కోరింది. అయితే ఇప్పటికే మునుగోడు ఎన్నికల ప్రక్రియ మొదలైనందున తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు  పేర్కొంటూ.. టీఆర్ఎస్ పిటిషన్ ను కొట్టేసింది.


More Telugu News