వీధి కుక్క దాడి.. నోయిడాలో పసికందు మృతి

  • ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో దారుణం
  • బిల్డింగ్ నిర్మాణ పనుల్లో కూలీలు నిమగ్నం
  • సెల్లార్ లో ఆడుకుంటున్న పిల్లలపై దాడి చేసిన శునకం
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో సోమవారం దారుణం జరిగింది. అపార్ట్ మెంట్ సెల్లార్ లో ఆడుకుంటున్న బాబుపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాబును ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ సోమవారం రాత్రి చనిపోయాడు. దీంతో బాబు తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. 

నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 100 లోని బోలీవార్డ్ అపార్ట్ మెంట్ నిర్మాణంలో ఉంది. సోమవారం ఎప్పట్లాగే కూలీలు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. వాళ్ల పిల్లలు ఆ చుట్టుపక్కల ఆడుకుంటున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వీధి కుక్కల గుంపు ఒకటి ఆ కాంపౌండ్ లోకి చొరబడ్డాయి. ఆడుకుంటున్న పిల్లలపై దాడి చేశాయి. కుక్కలను చూసి మిగతా పిల్లలు పారిపోగా.. ఏడాది వయసున్న ఓ బాబుపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చుట్టుపక్కల వాళ్లు వెంటనే అక్కడికి చేరుకుని బాబును దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాబును కాపాడేందుకు ప్రయత్నించినా, తీవ్ర గాయాలు కావడంతో ఫలితం లేకుండా పోయిందని వైద్యులు చెప్పారు.

సెక్టార్ 100 లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని పట్టుకుని అక్కడి నుంచి తరలించాలని మున్సిపాలిటీ సిబ్బందికి సూచించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వీధి కుక్కలను పట్టుకోవడానికి వెళ్లిన ప్రతిసారీ స్థానికులు తమను అడ్డుకుంటున్నారని మున్సిపాలిటీ సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదేంలేక తిరిగొస్తున్నామని చెప్పినట్లు పోలీసులు వివరించారు.


More Telugu News