మునుగోడు బరిలో మిగిలింది 47 మంది.. ప్రతి బూత్‌లో మూడు ఈవీఎంలు

  • మొత్తం 130 నామినేషన్ల దాఖలు
  • 47 నామినేషన్ల తిరస్కరణ
  • చివరి రోజు ఉపసంహరించుకున్న 36 మంది  
  • ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లు
మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచారు. చివరి రోజైన నిన్న 36 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఉప ఎన్నిక కోసం మొత్తం 130 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీటిలో 47 తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 83 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజైన నిన్న 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బరిలో నిలిచిన తుది అభ్యర్థుల సంఖ్య 47కు పరిమితమైంది. 

ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల పేర్లే పట్టే అవకాశం ఉండడంతో ఒక్కో బూత్‌లో మూడు ఈవీఎంలు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. అభ్యర్థుల పేర్లు, గుర్తుతో పాటు వారి ఫొటోలను కూడీ ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బరిలో ఉన్న 47 మంది అభ్యర్థుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు మాత్రమే గుర్తింపు పొందిన పార్టీలు. మిగతా వారిలో ఇతర పార్టీకు చెందినవారు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు. 

వీరికి నిన్నరాత్రే ఎన్నికల గుర్తులు కేటాయించారు. కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించవద్దన్న టీఆర్ఎస్ అభ్యర్థనతో ట్రక్కు, ట్రాక్టర్ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించలేదు. అయితే, రోడ్డు రోలర్ కోసం మాత్రం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీపడగా లాటరీ విధానంలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్ కొలిశెట్టికి కేటాయించినట్టు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్‌కు ఉంగరం గుర్తు కేటాయించారు.


More Telugu News