అమరావతి రైతుల పాదయాత్రలో వంగవీటి, పరిటాల.. 7 కిలో మీటర్లమేర నడిచిన టీడీపీ నేతలు

  • కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం చేరిన అమరావతి రైతుల యాత్ర
  • గోదావరి వంతెనపై రైతులతో కలిసి నడిచిన వంగవీటి రాధ, పరిటాల శ్రీరామ్
  • అమరావతి రైతు ఉద్యమానికి సాయం అందిస్తామని శ్రీరామ్ ప్రకటన
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి టూ అరసవెల్లి మహా పాదయాత్ర పేరిట రాజధాని రైతులు కొనసాగిస్తున్న పాదయాత్ర సోమవారం రాజమహేంద్రవరం చేరుకుంది. కొవ్వూరు నుంచి మొదలైన యాత్ర గోదావరి వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ సందర్భంగా రైతులకు మద్దతుగా టీడీపీ యువ నేతలు వంగవీటి రాధ, పరిటాల శ్రీరామ్ లు యాత్రలో స్వయంగా పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా అమరావతి రైతులకు మద్దతుగా తనతో పాటు వంగవీటి రాధ మద్దతు తెలిపిన విషయాన్ని పరిటాల శ్రీరామ్ స్వయంగా వెల్లడించారు. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వరకు గోదావరి వంతెనపై సాగిన యాత్రలో తాము పాలుపంచుకున్నామని, రైతుల వెంట తాము 7 కిలో మీటర్లమేర నడిచామని శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా అధికార వికేంద్రీకరణ 3 రాజధానులతో ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతులకు తమ మద్దతు ఉంటుందని, వారి ఉద్యమానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని కూడా శ్రీరామ్ తెలిపారు.


More Telugu News