ఒక ఇంటికి ఒకటే కుక్క.. ఘజియాబాద్ లో కొత్త నిబంధన

  • పెంపుడు శునకాలకు లైసెన్సింగ్ విధానం
  • నవంబర్ 1 నుంచి ప్రారంభం
  • ప్రమాదకరమైన మూడు శునక జాతులపై నిషేధం
  • కుక్కల దాడులు పెరగడంతో ఈ నిర్ణయాలు
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పట్టణంలో పెంపుడు కుక్కలు పెద్ద సమస్యగా మారాయి. వరుస దాడులతో స్థానికుల నుంచి పెంపుడు శునకాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఘజియాబాద్ మున్సిపల్ యంత్రాంగం మూడు రకాల శునక జాతులు (పిట్ బుల్, రాట్ వీలర్, డోగో అర్జెంటినో) పెంచుకోవడాన్ని నిషేధించింది.  

ఇక మీదట శునకాలను పెంచుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాలి. నవంబర్ 1 నుంచి లైసెన్స్ ల జారీ ప్రక్రియ మొదలు కానుంది. రెండు నెలల వ్యవధిలో లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఎత్తయిన అపార్ట్ మెంట్లలో ఉండేవారు తమ శునకాలను సర్వీస్ లిఫ్ట్ ల్లోనే తీసుకెళ్లాలి. కామన్ లిఫ్ట్ లో తీసుకెళ్లకూడదు. బయటకు తీసుకువెళుతుంటే వాటి మూతికి కవచం పెట్టాలి. ఈ మేరకు అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

‘‘పిట్ బుల్, రాట్ వీలర్, డోగో అర్జెంటినో జాతులు క్రూర స్వభావం కలిగినవి. ఈ శునకాలను కలిగి ఉండేందుకు అనుమతులు ఇవ్వం. లైసెన్స్ జారీ చేసేది లేదు. ఎవరైనా ఈ జాతి కుక్కలను కొనుగోలు చేస్తే అందుకు పూర్తి బాధ్యత వారే వహించాలి’’అని ఘజియాబాద్ బీజేపీ నేత, కౌన్సిలర్ సంజయ్ సింగ్ తెలిపారు. ఈ జాతి శునకాలను నిషేధించాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చింది సంజయ్ సింగ్ కావడం గమనార్హం. దీనికి మున్సిపల్ పాలక మండలి ఆమోదం తెలిపింది. ఇటీవలి కాలంలో పట్టణంలో 10 మంది పిల్లలు పెంపుడు కుక్కల దాడిలో గాయపడ్డాడు. ఒక చిన్నారి ముఖంపై 150 కుట్లు పడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


More Telugu News