విశాఖ వైసీపీ రాజకీయ యాత్ర తుస్సుమంది.. ఆ ఉక్రోషంతోనే జనసేన నేతల అరెస్టులు: లోకేశ్

  • జనసేన నేతలు, కార్యకర్తల అరెస్టులు దుర్మార్గమన్న లోకేశ్
  • అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • పవన్ బస చేసిన హోటల్ గదులను తనిఖీ చేయడాన్ని ఖండించిన టీడీపీ నేత
విశాఖపట్టణం విమానాశ్రయం వద్ద నిన్న చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలు, ఆపై జనసేన నాయకులపై కేసులు, అర్ధరాత్రి అరెస్టులపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. విశాఖ విమానాశ్రయం ఘటన పేరుతో జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్ట్ చేసిన జనసేన నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ గదులను తనిఖీ చేయడం, అక్కడున్న నాయకుల విషయంలో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. నగరంలో వైసీపీ చేపట్టిన రాజకీయ యాత్ర తుస్ మనడంతో ఆ ఉక్రోషం జనసేన నాయకులు, కార్యకర్తలపై చూపుతున్నట్టు తెలుస్తోందని లోకేశ్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. 

కాగా, విశాఖ విమానాశ్రయంలో వైసీపీ మంత్రులు, నాయకులపై రాళ్ల దాడికి సంబంధించిన కేసులో గత అర్ధ రాత్రి పోలీసులు జనసేన నాయకులు కోన తాతారావు, పీతల మూర్తియాదవ్, విశ్వక్‌సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్‌రెడ్డి, పీవీఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, కీర్తీస్, యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజులను అరెస్ట్ చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు.


More Telugu News