వైసీపీ చేసింది విశాఖ గర్జనకాదు... జగన్ రెడ్డి భజన: కొల్లు రవీంద్ర

  • విశాఖలో నేడు వైసీపీ గర్జన
  • జనాన్ని తరలించారన్న కొల్లు రవీంద్ర
  • కుట్ర రాజకీయాలకు జగనే బలవుతాడని వెల్లడి
  • విశాఖను రణరంగంగా మార్చారని ఆగ్రహం
  • రైతుల పాదయాత్ర కచ్చితంగా విజయవంతం అవుతుందని ధీమా
డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని తరలించి వైసీపీ నిర్వహించింది విశాఖ గర్జన కాదని, జగన్ రెడ్డి భజన అని టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. అమరావతి రైతుల్ని అడ్డుకోవడానికి జగన్ చేస్తున్న కుట్ర రాజకీయాలకు అంతిమంగా ఆయనే బలవుతాడని హెచ్చరించారు. 

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో కొల్లు రవీంద్ర నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకోసం వైసీపీ నేతలు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతే రాజధాని అని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదా? ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రులు, వైసీపీ నేతలు నాడు అందుకు ఒప్పుకోలేదా? అని నిలదీశారు. 

చంద్రబాబు హయాంలో ప్రారంభమైన రాజధాని పనుల్ని ఆపేసిన జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం చివరకు ఉత్తరాంధ్రలో భూదోపిడీకి తెరలేపారంటూ కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో స్పందించారు. 

"బొత్స, ధర్మాన, తమ్మినేని ఇతర వైసీపీ నేతలు విజయసాయి దోపిడీ సామ్రాజ్యానికి కాపలా కాస్తున్నారు తప్ప, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు. వైసీపీ నేతలు నిర్వహించిన సభ వరుణుడి ప్రకోపంతో నీరుగారి పోయింది. అన్నివర్గాలు, కులాలు, మతాలవారు ప్రశాంతంగా జీవించే విశాఖ నగరాన్ని రణరంగంగా మార్చారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తాం, ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామంటున్న జగన్ రెడ్డి, మంత్రుల మాటల్ని ఎవరూ నమ్మేస్థితిలో లేరు. 

హుద్ హుద్ తుపాన్ ధాటికి దెబ్బతిన్న విశాఖను బాగుచేయడానికి చంద్రబాబు ఎంత శ్రమించారో అందరికీ బాగా తెలుసు. ఆయన హయాంలో వేసిన భూగర్భ కేబుల్ పనులు ఎందుకు నిలిపేశారు? టీడీపీ హయాంలో చంద్రబాబు వేసిన రోడ్లు తప్ప, ఈ మూడేళ్లలో జగన్ రెడ్డి ఒక్క రోడ్డయినా వేశాడా? ఒక్క ఐటీ కంపెనీ అయినా కొత్తగా తీసుకొచ్చాడా?

 1000 సీట్లున్న ట్రిపుల్ ఐటీని 500 సీట్లకు పరిమితం చేసింది జగన్ కాదా? గిరిజన భూములు బలవంతంగా లాక్కొని బాక్సైట్ కోసం తవ్వుకోవడం, గంజాయి పండించడం తప్ప, ఐటీడీఏలకు రూపాయి అయినా ఇచ్చారా?

ప్రత్యేక హోదాపై యువతను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు ఆ ఊసు ఎత్తకుండా కులాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నాడు. వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి, వారిని రైతులపైకి ఉసిగొల్పి, కోర్టు అనుమతితో సాగుతున్న పాదయాత్రను అడ్డుకోవడం జగన్ రెడ్డి చేస్తున్న అతిపెద్ద తప్పు. పాదయాత్రకు భంగం కలిగించడానికే రోడ్ కమ్ రైలు వంతెనను మరమ్మతుల పేరుతో మూసేశాడు. 

ప్రజలమద్ధతుతో సాగుతున్న రైతుల పాదయాత్ర కచ్చితంగా దిగ్విజయమవుతుంది. వారు ఎట్టిపరిస్థితుల్లోనూ అరసవెల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకునే తీరుతారు” అని రవీంద్ర స్పష్టంచేశారు.


More Telugu News