గంగూలీని అడిగాకే బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బిన్నీని ఎంపిక చేశాం: బీసీసీఐ కోశాధికారి అరుణ్

  • గంగూలీ పనితీరు పట్ల సభ్యులంతా సంతృప్తిగా ఉన్నారని స్పష్టీకరణ
  • ఈ విషయంలో మీడియాలో వార్తలన్నీ పుకార్లే అన్న అరుణ్
  • ఐపీఎల్ చైర్మన్ పోస్టును దాదా అంగీకరించలేదని వెల్లడి
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలం కొన్ని రోజుల్లో ముగియనుంది. మరో పర్యాయం అధ్యక్షుడిగా పని చేస్తానని గంగూలీ కోరినప్పటికీ బీసీసీఐ పెద్దలు ఇందుకు ఒప్పుకోలేదు. అధ్యక్షుడిగా గంగూలీ పని తీరుపై అసంతృప్తితోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే, గంగూలీ పని తీరుపై బీసీసీఐలో ప్రతీ సభ్యుడు సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారని బోర్డు కోశాధికారి, ఐపీఎల్ కు చైర్మన్ కాబోతున్న అరుణ్ ధుమల్ చెప్పారు. సౌరవ్ కి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదంటున్నారు. గంగూలీ సహా అందరినీ సంప్రదించిన తర్వాత, ఏకాభిప్రాయంతోనే  బోర్డు తదుపరి అధ్యక్షుడిగా రోజర్ బిన్నీని ఎంపిక చేసినట్లు తెలిపారు. 
  
‘స్వతంత్ర భారతదేశంలో మూడేళ్లకు పైగా పనిచేసిన బీసీసీఐ అధ్యక్షుడు ఎవరూ లేరు. దాదా గురించి మీడియాలో వచ్చినవన్నీ ఊహాగానాలే. కొంతమంది సభ్యులు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారనే వార్తలు నిరాధారమైనవి. తనకు  వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాదా పట్ల మొత్తం బోర్డు సభ్యులందరూ చాలా సంతోషంగా, సంతృప్తి చెందారు. కరోనా వల్ల ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ గత మూడేళ్లలో ఆయన నాయకత్వంలో బోర్డు ముందుకు నడిచింది. భారత  అత్యుత్తమ నాయకులలో దాదా ఒకరు. అడ్మినిస్ట్రేటర్‌గా కూడా బీసీసీఐని ముందుకు తీసుకెళ్లారు. మేమంతా ఒక జట్టుగా పని చేశాము’ అని ఆయన అన్నారు. 

బోర్డు తదుపరి అధ్యక్షుడిగా రోజర్ బిన్నీకి అవకాశం ఇవ్వాలన్నది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమని అరుణ్ చెప్పారు. ఈ విషయంలో గంగూలీ అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాతే ముందుకెళ్లామన్నారు. ఒకవేళ సౌరవ్ ఐపీఎల్ చైర్మన్ పదవి చేపడితే తాను బోర్డుకు దూరంగా ఉండేవాడినని అన్నారు. కానీ, ఆ ఆఫర్ ను గంగూలీ ఒప్పుకోలేదని చెప్పారు.


More Telugu News