ప్రొఫెస‌ర్ సాయిబాబా కేసుపై రేపు సుప్రీంకోర్టులో అత్య‌వ‌స‌ర విచార‌ణ‌

  • సాయిబాబాతో పాటు ఐదుగురిని నిర్దోషులుగా ప్ర‌క‌టించిన బాంబే హైకోర్టు
  • నిందితుల‌ను విడుద‌ల చేయాలంటూ ఉత్త‌ర్వుల జారీ
  • బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో స‌వాల్ చేసిన ఎన్ఐఏ
  • సాయిబాబా విడుద‌ల‌ను నిలుపుద‌ల చేయాల‌న్న అభ్య‌ర్థ‌న‌కు సుప్రీం నిరాక‌ర‌ణ‌
  • ఎన్ఐఏ పిటిష‌న్‌పై శ‌నివారం విచార‌ణ చేప‌ట్టేందుకు అంగీకారం
మావోయిస్టుల‌తో సంబంధాలున్నాయన్న ఆరోప‌ణ‌ల‌పై అరెస్టైన ప్రొఫెస‌ర్ సాయిబాబా కేసులో శుక్ర‌వారం మ‌రో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో సాయిబాబాతో పాటు మ‌రో ఐదుగురు నిర్దోషులంటూ బాంబే హైకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. అంతేకాకుండా సాయిబాబాతో పాటు ఐదుగురిని విడుద‌ల చేయాల‌ని కూడా హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు కాపీని అందుకున్న వెంట‌నే నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బాంబే హైకోర్టు తీర్పును నిలుపుద‌ల చేయాల‌ని, సాయిబాబా విడుద‌ల‌ను నిలిపివేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు సోమ‌వారం విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తొలుత తెలిపింది.

అయితే సీజేఐ జ‌స్టిస్ ల‌లిత్‌తో చ‌ర్చలు జ‌రిపిన త‌ర్వాత జ‌స్టిస్ చంద్ర‌చూడ్ నేతృత్వంలోని బెంచ్ కీల‌క నిర్ణయాన్ని ప్ర‌క‌టించింది. ప్రొఫెస‌ర్ సాయిబాబా విడుద‌ల‌ను నిలుపుద‌ల చేయ‌డం కుద‌ర‌ద‌ని చెప్పిన ధ‌ర్మాస‌నం... ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిష‌న్‌ను అత్య‌వ‌స‌ర‌మైన‌దిగా భావిస్తూ శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌పై విచారిస్తామ‌ని పేర్కొంది. ఈ పిటిష‌న్‌ను విచారించేందుకు జ‌స్టిస్ ఎంఆర్ షా, జ‌స్టిస్ బేలా త్రివేదీల‌తో కూడిన బెంచ్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బాంబే హైకోర్టు తీర్పును ఎన్ఐఏ స‌వాల్ చేయ‌డం, దానిపై సుప్రీంకోర్టు అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు అంగీక‌రించ‌డం ప్రాదాన్యం సంత‌రించుకుంది.


More Telugu News