టీఆర్ఎస్‌కు మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్ గుడ్ బై?... బీజేపీలో చేరే అవ‌కాశం

  • మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ
  • కూసుకుంట్ల నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వైనం
  • గురువారం రాత్రి ఢిల్లీకి చేరిన బూర న‌ర్స‌య్య గౌడ్‌
  • ఇప్ప‌టికే బండి సంజ‌య్‌తో క‌లిసి త‌రుణ్ చుగ్‌తో క‌లిసిన‌ట్లుగా వార్త‌లు
  • ఈ రాత్రికి అమిత్ షాతో భేటీ అయ్యే అవ‌కాశం
మునుగోడు ఉప ఎన్నిక‌ల వేళ తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు బూర న‌ర్స‌య్య గౌడ్‌ గుడ్ బై చెప్పేలా వున్నారు. భువ‌న‌గిరి మాజీ ఎంపీ అయిన ఈయన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌ను ఆశించారు. అయితే, పార్టీ అధిష్ఠానం టికెట్‌ను కూసుకుంట్ల ప్ర‌భాకర్ రెడ్డికి ఇచ్చింది. ఈ ప‌రిణామంతో అసంతృప్తి వ్య‌క్తం చేసిన న‌ర్స‌య్య గౌడ్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలిపించిన కేసీఆర్ ఆయ‌న‌ను బుజ్జ‌గించారు. ఈ క్ర‌మంలో గురువారం ప్ర‌భాకర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లుకు కూడా న‌ర్స‌య్య హాజ‌ర‌య్యారు.

గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన న‌ర్స‌య్య గౌడ్‌... బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తో క‌లిసి బీజేపీ తెలంగాణ ఇంచార్జీ త‌రుణ్ చుగ్‌తో భేటీ అయిన‌ట్లు స‌మాచారం. బీజేపీలోకి న‌ర్స‌య్య గౌడ్ ఎంట్రీకి త‌రుణ్ చుగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా... అదే విష‌యాన్ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు కూడా చేర‌వేసిన‌ట్లు స‌మాచారం. తాజాగా శుక్ర‌వారం రాత్రి న‌ర్సయ్య గౌడ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను క‌లవ‌నున్న‌ట్లు స‌మాచారం. అమిత్ షాతో భేటీ త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేర‌తార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. 

టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌గా ఎదిగిన బూర న‌ర్స‌య్య గౌడ్‌.. 2014 ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లోనూ భువ‌న‌గిరి నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈ క్ర‌మంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే దిశ‌గా ఆయ‌న సాగారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో మునుగోడుకు ఉప ఎన్నిక రావ‌డంతో బీసీల‌కు టికెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన న‌ర్స‌య్య గౌడ్‌... అదే సామాజిక వ‌ర్గానికి చెందిన త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.


More Telugu News