గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకపోవడంపై స్పందించిన ఈసీ

  • హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి మాత్రమే షెడ్యూల్ ప్రకటన
  • గుజరాత్ ను విస్మరించడంపై అనుమానాలు
  • నిబంధనల ఉల్లంఘన జరగలేదంటున్న ఎన్నికల ప్రధాన అధికారి
హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికలను ప్రస్తావించకుండా అందరినీ ఆశ్చర్యపరిచింది. హిమాచల్ తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీకి కూడా ఈ రోజే షెడ్యూల్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఒక్క హిమాచల్ ఎన్నికల తేదీలను మాత్రమే ప్రకటించి గుజరాత్ ను విస్మరించడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. ఆరు నెలల వ్యవధిలో ముగిసే రాష్ట్రాల ఎన్నికలను ఒకే షెడ్యూల్ లో నిర్వహిస్తారు. హిమాచల్ ప్రస్తుత శాసనసభ పదవీకాలం జనవరి 8వ తేదీన ముగుస్తుండగా, గుజరాత్ శాసన సభకు ఫిబ్రవరి 18 వరకు గడువు ఉంది. 

రెండింటికీ షెడ్యూల్ ప్రకటించాల్సిన ఈసీ.. కేవలం హిమాచల్ ఎన్నికలకే ప్రకటన చేయడంతో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. దీనిపై  కమిషన్ ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ స్పందించారు. విస్తృత చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వాతావరణ మార్పులు, ఇతర కారణాల దృష్ట్యా హిమాచల్ ఎన్నికలను కాస్త ముందుగా ప్రకటించామన్నారు. రెండు రాష్ట్రాల శాసన సభల పదవీకాలం ముగింపునకు మధ్య 40 రోజుల గడువు ఉందన్నారు. ఒక రాష్ట్రం ఫలితం మరో రాష్ట్ర ఎన్నికపై పడకుండా ఉండేందుకు 30 రోజుల విరామం ఉంటే సరిపోతుందని చెప్పారు. అయితే, గుజరాత్ కు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారనేది మాత్రం ఆయన చెప్పలేదు.


More Telugu News