చార్జ‌ర్ లేకుండా ఐఫోన్ అమ్మిన యాపిల్‌... రూ.164 కోట్ల జ‌రిమానా విధించిన బ్రెజిల్ కోర్టు

  • చార్జ‌ర్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న యాపిల్‌
  • స‌మ‌స్యను ప‌రిష్క‌రించ‌కుండా చార్జింగ్ కేబుల్‌తో ఫోన్లు విక్ర‌యిస్తున్న వైనం
  • ఇదివ‌ర‌కే యాపిల్‌పై బ్రెజిల్ న్యాయ శాఖ 2 మిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా 
  • తాజాగా సావో పోలో సివిల్ కోర్టు 20 మిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధించిన వైనం
ఐఫోన్‌ను చార్జ‌ర్ లేకుండా అమ్మిన యాపిల్‌కు బ్రెజిల్‌లోని ఓ సివిల్ కోర్టు ఏకంగా రూ.164 కోట్ల జ‌రిమానా విధించింది. వినియోగ‌దారుల‌ను త‌ప్పుడు దోవ ప‌ట్టించే ఈ త‌ర‌హా నిర్ణ‌యాలు మోస‌పూరిత ఆచ‌ర‌ణ కింద‌కు వ‌స్తాయ‌న్న కోర్టు...అందుకు ప‌రిహారంగా 20 మిలియ‌న్ డాలర్ల (దాదాపుగా రూ.164 కోట్లు) జ‌రిమానా చెల్లించాల‌ని ఐఫోన్ త‌యారీ సంస్థ‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ త‌ర‌హా చ‌ర్య‌ల‌తో వినియోగ‌దారుల‌ను బ‌ల‌వంతంగా మ‌రో వ‌స్తువును కొనేలా చేయ‌డ‌మేన‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. అంతేకాకుండా గ‌డ‌చిన రెండేళ్ల‌లో ఐఫోన్ 12, 13 ఫోన్ల‌ను కొన్న వినియోగ‌దారులంద‌రికీ చార్జ‌ర్ల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని కూడా యాపిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. 

ఐఫోన్ విక్ర‌యాల్లో చార్జర్ స‌మ‌స్య‌ గ‌త కొంత‌కాలంగా యాపిల్‌కు ఎదుర‌వుతోంది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప‌ర్యావ‌ర‌ణ హితం పేరిట చార్జ‌ర్‌లు లేకుండా కేవ‌లం చార్జింగ్ కేబుల్ ఇస్తూ కొన్ని దేశాల్లో యాపిల్ త‌న ఐఫోన్ల‌ను విక్ర‌యిస్తోంది. ఈ త‌ర‌హా వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన బ్రెజిల్ న్యాయ‌శాఖ యాపిల్‌కు 2 మిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధించింది. ఈ ఆదేశాల‌ను అంత‌గా ప‌ట్టించుకోని యాపిల్ తాజాగా బ్రెజిల్‌లో చార్జ‌ర్ లేకుండానే ఐఫోన్‌ను విక్ర‌యించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన బ్రెజిల్ న‌గ‌రం సావో పోలోలోని సివిల్ కోర్టు ఆ సంస్థ‌కు 20 మిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధించింది.


More Telugu News