వాటర్‌ బాటిల్‌ తో బస్సు వైపర్‌.. భలే ఐడియా అంటూ నెటిజన్ల కామెంట్స్‌.. వీడియో ఇదిగో

  • యూపీలోని మీరట్ ప్రాంతంలో విరిగిపోయిన ఆర్టీసీ బస్సు వైపర్
  • తాత్కాలికంగా నీటి బాటిల్, తాళ్లు కట్టి ఏర్పాటు చేసుకున్న డ్రైవర్
  • ఆలోచన బాగుందంటూ కొందరి ప్రశంసలు
  • ప్రభుత్వ సర్వీసుల దుస్థితిని చూపుతోందని మరికొందరి విమర్శలు
ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు, ఇతర పెద్ద వాహనాల అద్దాలపై వైపర్లు ఉండటం మామూలే. వాన పడినప్పుడు ఆ వైపర్లు లేకుంటే.. అద్దాలపై నీరు చేరి రోడ్డు కనిపించదు మరి. ఏ చిన్నవాన పడినా వైపర్ వేసుకునే వాహనాలు వెళుతుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ప్రాంతంలో ఓ ఆర్టీసీ (ఆ రాష్ట్రంలో అయితే పరీవాహన్ నిగమ్) బస్సు డ్రైవర్ మాత్రం చిత్రమైన ఆలోచన చేశాడు. బస్సు వైపర్ విరిగిపోయి ఉండటం, వర్షం పడే పరిస్థితి ఉండటంతో ఒక నీటి బాటిల్, రెండు తాళ్ల సాయంతో వైపర్ ను సెట్ చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.

టాప్ దగ్గర బిగించి..
విరిగిపోయిన వైపర్ ను బస్సు డ్రైవర్, ఇతర సిబ్బంది కలిసి చిత్రంగా బిగించారు. బస్సు టాప్ వైపు రంధ్రం చేసి.. వైపర్ ను అక్కడి నుంచి తలకిందులుగా బిగించారు. ఇక వైపర్ కింది భాగానికి తాడు కట్టి.. దానికి బరువుగా బాటిల్ ను వేలాడ దీశారు. వైపర్ మరోవైపు నుంచి మరో తాడు కట్టి డ్రైవర్ కు అందేలా ఏర్పాటు చేశారు. డ్రైవర్ ఆ తాడును లాగినప్పుడు వైపర్ ఓ వైపు కదులుతూ.. వదిలేసినప్పుడు బాటిల్ బరువుకు మరోవైపు కదిలేలా చేశారు.

  • విపిన్ కుమార్ అనే పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేయగా వేల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 
  • బస్సు డ్రైవర్, సిబ్బంది చేసిన పని విభిన్నంగా ఉందని కొందరు నెటిజన్లు పొగుడుతుంటే.. మన దేశంలో ఎక్కడైనా సరే ఆర్టీసీ బస్సుల దుస్థితి ఇలాగే ఉంటుందని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజల పట్ల నిర్లక్ష్యమే చూపుతాయని పలువురు మండిపడుతున్నారు.
  • “బస్సు డ్రైవర్ వర్షంలో వెళుతున్నప్పుడు ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. మరో చేత్తో వైపర్ తాడు లాగుతూ ఉండాలా? ప్రమాదం జరిగితే ఎలా? అధికారుల నిర్లక్ష్యం ప్రాణాలను బలిగొనేలా ఉంది..” అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దెబ్బకు రిపేర్ చేసి..
తమ సంస్థ బస్సు దుస్థితి వైరల్ గా మారడంతో మీరట్ ఆర్టీసీ విభాగం వెంటనే స్పందించింది. సదరు బస్సుకు వైపర్ ను బిగించి, దీనికి సంబంధించిన వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఓ చోట నిలిపి ఉన్న ఆ బస్సు అద్దంపై బాటిల్ తో నీళ్లు పోస్తూ.. వైపర్ ను ఆన్ చేసి పెట్టి.. బాగా పనిచేస్తోందని వివరించింది. ఇక విమర్శలు ఆపాలని విజ్ఞప్తి చేసింది కూడా.


More Telugu News