నరేంద్రను ముందు ఆసుపత్రికి తరలించండి... వైద్యుల నివేదిక వచ్చాకే రిమాండ్ పై నిర్ణయం తీసుకుంటామన్న జడ్జి

  • న‌రేంద్ర‌ను జ‌డ్జి ముందు హాజ‌రుప‌ర‌చిన సీఐడీ అధికారులు
  • సీఐడీ అధికారులు త‌న‌ను కొట్టారంటూ జ‌డ్జికి ఫిర్యాదు చేసిన న‌రేంద్ర‌
  • నరేంద్ర ఆరోగ్యంపై నివేదిక అందించాలన్న కోర్టు 
  • జీజీహెచ్ వైద్యులకు ఆదేశాలు
ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన టీడీపీ కేంద్ర కార్యాల‌య మీడియా కో ఆర్డినేట‌ర్ దార‌ప‌నేని న‌రేంద్రను రిమాండ్‌కు పంపే విష‌యాన్ని సీఐడీ కోర్టు న్యాయ‌మూర్తి వాయిదా వేశారు. న‌రేంద్రను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ముందుగా గుంటూరులోని జీజీహెచ్‌కు త‌ర‌లించాల‌ని న్యాయ‌మూర్తి సీఐడీ అధికారుల‌ను ఆదేశించారు. న‌రేంద్ర ఆరోగ్యంపై నివేదిక అందించాల‌ని జీజీహెచ్ వైద్యుల‌కు ఆదేశాలు జారీ చేశారు. జీజీహెచ్ వైద్యులు అందించే నివేదిక‌ను ప‌రిశీలించిన త‌ర్వాతే న‌రేంద్ర‌ను రిమాండ్‌కు పంపే విష‌యంపై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని న్యాయ‌మూర్తి తెలిపారు. 

బుధ‌వారం న‌రేంద్ర‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం రాత్రి న‌రేంద్ర‌ను త‌మ క‌స్ట‌డీలోనే ఉంచుకున్న సీఐడీ అధికారులు గురువారం రాత్రి సీఐడీ కోర్టు జ‌డ్జి ముందు హాజ‌రుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా సీఐడీ అధికారులు విచార‌ణ పేరిట తన‌ను తీవ్రంగా కొట్టార‌ని న‌రేంద్ర జ‌డ్జికి తెలిపారు. న‌రేంద్ర వాంగ్మూలాన్ని న‌మోదు చేసుకున్న న్యాయ‌మూర్తి... న‌రేంద్ర‌ను ముందుగా ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌ని ఆదేశించారు.


More Telugu News