పనివేళ్లలో వెబ్ కామ్ ఆపేశాడని ఉద్యోగిపై వేటు... కంపెనీకి రూ.60 లక్షల జరిమానా విధించిన కోర్టు

  • ఫ్లోరిడా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 'చేటు' కంపెనీ
  • తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు
  • ఓ ఉద్యోగి వెబ్ కామ్ ఆన్ చేయలేదంటూ ఆగ్రహం
  • కోర్టును ఆశ్రయించిన వ్యక్తి
అమెరికాలోని ఫ్లోరిడా నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఓ సంస్థకు కోర్టు భారీ జరిమానా వడ్డించింది. ఓ ఉద్యోగిని తొలగించడానికి చెప్పిన కారణం సమంజసంగా లేదంటూ ఆ కంపెనీకి రూ.60 లక్షల జరిమానా విధించింది. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయాలని ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాకు చెందిన 'చేటు' అనే టెలీమార్కెటింగ్ కంపెనీ కూడా తన ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచించింది. అంతేకాదు, ఉద్యోగులు తమ ల్యాప్ టాప్/పీసీ స్క్రీన్ ను కంపెనీ అధికారులకు షేర్ చేయాలని, ఉద్యోగులు పనివేళల్లో లైవ్ వీడియోలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. 

అయితే నెదర్లాండ్స్ దేశం నుంచి పనిచేసే ఓ ఉద్యోగి పనివేళల్లో వెబ్ కామ్ ను ఆన్ చేయకపోవడంతో సదరు కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెబ్ కామ్ ఆపేసి విధులు నిర్వర్తించాడన్న కారణంతో అతడిని ఉద్యోగం నుంచి పీకిపారేసింది. 

దాంతో అతడు తన స్వదేశంలో కోర్టును ఆశ్రయించాడు. వెబ్ కామ్ ద్వారా నిఘా వేయడం అనేది ఓ వ్యక్తి ఏకాంతానికి భంగం కలిగించడమేనని, స్క్రీన్ ను షేర్ చేయాలని కోరడం ట్రాక్ చేసేందుకేనని అతడు ఆరోపించాడు. 

అతడి పిటిషన్ పై స్పందించిన డచ్ న్యాయస్థానం 'చేటు' కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెబ్ కామ్ నిఘాలో పనిచేయాలని ఉద్యోగులను బలవంతం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంది. ఆ కంపెనీకి రూ.60 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని సదరు ఉద్యోగికి చెల్లించాలని అమెరికా కంపెనీని ఆదేశించింది.


More Telugu News