ఉక్రెయిన్ లో వదిలి వచ్చిన తన పెంపుడు జాగ్వార్ల కోసం భారత సంతతి వైద్యుడి ఆవేదన

  • ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • ఉక్రెయిన్ ను వీడిన డాక్టర్ గిడికుమార్ పాటిల్
  • పెంపుడు జాగ్వార్లను ఓ రైతుకు అప్పగించిన వైద్యుడు
  • వాటి యోగక్షేమాలపై ఆందోళన
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలయ్యాక అనేకమంది భారతీయులు ఉక్రెయిన్ ను వీడి స్వదేశానికి చేరుకున్నారు. భారత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ఉక్రెయిన్ లోని భారత పౌరులను సురక్షితంగా తరలించింది. ఉక్రెయిన్ లోని మరికొందరు భారత పౌరులు పొరుగున ఉన్న పోలెండ్ వంటి దేశాల్లో తలదాచుకున్నారు. అలాంటివారిలో డాక్టర్ గిడికుమార్ పాటిల్ ఒకరు. 

యుద్ధం మొదలయ్యాక ఆయన ఉక్రెయిన్ లోని లుహాన్స్క్ ను వీడి పోలెండ్ వెళ్లిపోయారు. కానీ, ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రెండు జాగ్వార్లను మాత్రం తనతో తీసుకెళ్లలేకపోయాడు. ప్రస్తుతం ఆ వన్యప్రాణులు రెండు ఉక్రెయిన్ లోని ఓ రైతు వద్ద ఉన్నాయి.

వాటి బాగోగుల పట్ల తాజాగా డాక్టర్ గిడికుమార్ పాటిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. భారత కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ రెండు జాగ్వార్లను ఉక్రెయిన్ నుంచి తరలించాలని విజ్ఞప్తి చేశాడు. 

తాను ఉక్రెయిన్ వదిలి వచ్చేటప్పుడు తన పెంపుడు జాగ్వార్లను ఓ స్థానిక రైతుకు అప్పగించానని, వాటికి మూడ్నెల్లకు సరిపడా ఆహార పదార్థాలను కూడా ఫ్రీజర్ లో ఉంచానని వెల్లడించారు. అంతేకాదు, వాటి మూడ్నెల్ల ఖర్చు కోసం ఆ రైతుకు 2,400 డాలర్ల డబ్బు కూడా ఇచ్చానని తెలిపారు. 

తాను ఉక్రెయిన్ నుంచి పోలెండ్ వెళ్లేందుకే లక్ష డాలర్లు ఖర్చయిందని, తన వస్తువులు చాలావరకు అమ్మేయగా వచ్చిన డబ్బుతో పోలెండ్ వెళ్లానని ఆ డాక్టర్ వివరించారు. తన పెంపుడు జాగ్వార్ల కోసం మరింత డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు.


More Telugu News