మా పిల్లలను మానసిక వేదనకు గురిచేశారు... సీఐడీ పోలీసులపై హైకోర్టును ఆశ్రయించిన అయ్యన్న కోడలు

  • సువ‌ర్ణ పిటిష‌న్‌పై విచారణ చేప‌ట్టిన హైకోర్టు
  • 2 వారాల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ డీజీపీ, సీఐడీకి హైకోర్టు నోటీసులు
  • సువ‌ర్ణ కుటుంబంపై మ‌ళ్లీ ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌వ‌న్న ప్ర‌భుత్వ న్యాయ‌వాది
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడి కోడ‌లు, పార్టీ ఏపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కాయ‌ల విజ‌య్ స‌తీమ‌ణి డాక్ట‌ర్ సువ‌ర్ణ గురువారం ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఏపీ సీఐడీ అధికారులు త‌మ పిల్ల‌ల‌ను మాన‌సిక వేద‌న‌కు గురి చేశారన్న ఆమె.. భ‌విష్య‌త్తులోనూ సీఐడీ పోలీసుల నుంచి త‌మ‌కు ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశాలున్నాయని పిటిష‌న్‌లో కోర్టుకు తెలిపారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు సీఐడీ అద‌న‌పు డీజీతో పాటు పోలీసు శాఖ అధిప‌తి హోదాలో డీజీపీ, సీఐ పెద్దిరాజుల‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌న్న కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసింది.

హైకోర్టు తాజాగా జారీ చేసిన నోటీసుల నేప‌థ్యంలో త‌మ కుటుంబాన్ని నోటీసుల పేరుతో మ‌ళ్లీ ఇబ్బంది పెడ‌తార‌ని సువ‌ర్ణ కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. అలా త‌మ‌ను మ‌ళ్లీ ఇబ్బంది పెట్ట‌కుండా ఉండేలా సీఐడీ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని కూడా ఆమె త‌రఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. ఈ సంద‌ర్భంగా క‌ల్పించుకున్న ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది మ‌రోమారు ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌వ‌ని హామీ ఇచ్చారు.


More Telugu News