'ఇండియన్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది: అల్లు అర్జున్

  • బన్నీకి జాతీయస్థాయి అవార్డు
  • 'ఇండియన్ ఆఫ్ ద ఇయర్' గా ఎంపిక చేసిన సీఎన్ఎన్ న్యూస్-18
  • నిన్న ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం
  • కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా బన్నీకి అవార్డు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జాతీయస్థాయి పురస్కారం లభించింది. జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ న్యూస్-18 'ఇండియన్ ఆఫ్ ద ఇయర్' 12వ విడత అవార్డులు అందించింది. దేశరాజధాని ఢిల్లీలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. 

'పుష్ప' చిత్రంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన అల్లు అర్జున్ కు 'ఇండియన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు ప్రదానం చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కు హాజరైన బన్నీ... కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్, ఇతర సినీ అవార్డులు కాకుండా, జాతీయస్థాయి పురస్కారాలు అందుకోవడం బన్నీకి ఇదే ప్రథమం. 

తనకు ప్రతిష్ఠాత్మక సీఎన్ఎన్ న్యూస్-18 అవార్డు లభించడం పట్ల అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించారు. 'ఇండియన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల సీఎన్ఎన్ న్యూస్-18 మీడియా సంస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. తనకు అవార్డును ప్రదానం చేసిన స్మృతి ఇరానీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ అవార్డును అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అల్లు అర్జున్ వివరించారు. 

అంతకుముందు, ఢిల్లీలో అవార్డును అందుకున్న అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ, దక్షిణాదిలో తాను అనేక అవార్డులు అందుకున్నానని, ఉత్తరాది నుంచి తాను అందుకున్న మొదటి పురస్కారం ఇదేనని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశపు సౌందర్యం అని కొనియాడారు. తాము తీసిన 'పుష్ప' చిత్రాన్ని యావత్ భారతదేశం ఆదరించడమే అందుకు నిదర్శనం అని వివరించారు. దీన్ని భారతీయ సినిమా సాధించిన విజయంగానే భావిస్తామని బన్నీ వినమ్రంగా తెలిపారు.


More Telugu News