తన పార్టీ నేతల కబంధహస్తాల్లో చిక్కి విశాఖ విలవిల్లాడుతున్నా జగన్ రెడ్డి స్పందించడా?: బొండా ఉమ

  • మంగళగిరిలో బొండా ఉమ మీడియా సమావేశం
  • వైసీపీ ఎంపీలు విజయసాయి, ఎంవీవీ సత్యనారాయణపై ఆరోపణలు
  • వీరిపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదన్న బొండా ఉమ
విశాఖనగరాన్ని క్రైమ్, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చిన వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, ఇతర నేతలు రాబందుల్లా ఆ ప్రాంతంపై పడి విలువైన భూముల్ని కబ్జా చేస్తూ, భూ యజమానుల్ని రాబందుల్లా పీక్కుతింటున్నా జగన్ రెడ్డి స్పందించడంలేదని  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. సీఎం ఎందుకు వారిపై చర్యలకు వెనకాడుతున్నాడని నిలదీశారు. బొండా ఉమ నేడు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

“వైసీపీ ముఖ్యనేతలు, వైసీపీ చెంచాలు ముఖ్యమంత్రి అండదండలతోనే విశాఖకేంద్రంగా భూ దందాలకు తెరలేపారని ప్రజలంతా భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి దసపల్లా భూములు సహా, ఇతర విలువైన భూముల్ని చేజిక్కించుకోగా, కూర్మన్నపాలెంలోని స్థలాన్ని వైసీపీ ఎంపీ ఎంవీవీ,  రూ.500 కోట్ల విలువైన మధురవాడ ఎన్సీసీ భూముల్ని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తమ్ముడు కాజేశాడు. ఇలా వైసీపీ నేతలు కొట్టేసిన భూముల జాబితా కొండవీటి చాంతాడంత ఉంది. 

డేటా సెంటర్ కు గతప్రభుత్వం కేటాయించిన రూ.600 కోట్ల భూమిని, హయగ్రీవా వృద్ధాశ్రమానికి చెందిన రూ.400 కోట్ల భూమిని దిగమింగారు. బే పార్క్, రాడిసన్ హోటల్, భీమిలి బీచ్ రోడ్ లోని నేరెళ్లవలసలోని రూ.100 కోట్ల భూమి కబ్జాకు గురైంది. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు సహా, బడులు, గుడులు సహా వేటినీ వైసీపీ భూ మాఫియా వదలడంలేదు. 

విశాఖనగరాన్ని, ఉత్తరాంధ్రను పూర్తిగా దోచేసి, కనుమరుగు చేసేవరకు ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకుంటాడా? జగన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విశాఖ నగరాన్ని కాపాడాలని... అక్కడి ప్రజలకు అండగా నిలవాలని ఉంటే, తక్షణమే తన పార్టీ నేతల భూదందాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. 

తాను ఏతప్పు చేయలేదని, ఎలాంటి విచారణ జరిపినా అందుకు సిద్ధంగా ఉన్నానని విజయసాయిరెడ్డి సొల్లు కబుర్లు చెప్పాడు. ఆయనే స్వయంగా తనపై ఎందుకు విచారణ కోరడంలేదో సమాధానం చెప్పాలి. 

చంద్రబాబుగారి హయాంలో ఆర్థిక రాజధానిగా విశాఖ నగరం విరాజిల్లితే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలోనే రూ.40 వేల కోట్ల పైచిలుకు భూములు కొట్టేశారు. ఇంత జరుగుతున్నా విశాఖ నగరంలోని మేధావులు, ప్రజాసంఘాలు ఎందుకు స్పందించడంలేదు? లోపాయికారీగా రూ.40 వేల కోట్ల విలువైన భూములు కొట్టేసిన సంఘటనలను విశాఖనగర చరిత్రలో ఎన్నడైనా జరిగాయా అని ఆ ప్రాంత ప్రజలు, మేధావులు ఆలోచించాలి" అంటూ బొండా ఉమ పేర్కొన్నారు.


More Telugu News