బ్రిటీష్ పాలన కంటే ఘోరమైన స్థితిలో ఏపీ ఉంది: చంద్రబాబు

  • టీడీపీ ప్రధాన కార్యాలయం మీడియా సమన్వయకర్త అరెస్ట్
  • ఖండించిన చంద్రబాబు
  • నరేంద్ర అరెస్ట్ అక్రమం అంటూ ట్వీట్
  • నరేంద్రకు టీడీపీ అండగా నిలుస్తుందని వెల్లడి
టీడీపీ ప్రధాన కార్యాలయ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్టు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గుంటూరులో నిన్న నరేంద్ర నివాసానికి వెళ్లిన సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నరేంద్ర అరెస్ట్ అక్రమం అని నినదించారు. బ్రిటీష్ పాలన కంటే ఘోరమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని విమర్శించారు. సీఐడీ అధికారులు వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమంగా వ్యవహరిస్తున్న పోలీసులు 'రేపు' అనేది ఒకటుంటుందని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. నరేంద్రకు టీడీపీ అండగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. 

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల 15న పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు పార్టీ పార్లమెంటు స్థానాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, సమన్వయకర్తలు, త్రీ మేన్ కమిటీ సభ్యులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.


More Telugu News