సొంత ఖర్చుతో భార్యతో కలిసి చంద్రుడి పర్యటనకు వెళ్లనున్న ప్రపంచ మొదటి స్పేస్​ టూరిస్ట్​

  • ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ లో ప్రయాణానికి ఒప్పందం
  • మొత్తం 10 మందితో చంద్రుడిపైకి వెళ్లేందుకు సిద్ధం
  • పర్యటన ఖర్చు మొత్తం భరించేందుకు రెడీ
ప్రపంచంలోనే మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు మరో సాహస యాత్రకు సిద్ధం అయ్యాడు. ఈ సారి ఎలన్ మస్క్ కు చెందిన  స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్‌లో చంద్రుని చుట్టూ తిరిగేందుకు సిద్ధమయ్యాడు. 21 ఏళ్ల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఒక చిన్న పర్యటన చేసిన 82 ఏళ్ల డెన్నిస్ టిటో ఇకపై ఆ రకమైన విమానంలో అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు స్టార్ షిప్ లో టిటో వారం పాటు చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనున్నాడు. అయితే, 21 ఏళ్ల క్రితం మాదిరి టిటో ఇప్పుడు ఒంటరిగా ఉండడు. అతనికి తోడు భార్య అకికోతో సహా మొత్తం 10 మంది చంద్రుని చుట్టూ ప్రయాణిస్తారు. ఈ పర్యటనకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి టిటో  సిద్ధంగా ఉన్నాడు. అయితే, దీనికి మరో ఐదేళ్ల వరకూ సమయం పట్టే అవకాశం ఉంది. 

టిటో 2001లో స్పేస్ టూరిజంను ప్రారంభించాడు. సొంత ఖర్చులతో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఇప్పుడు చంద్రుడిని చుట్టి రావడానికి స్పేస్ ఎక్స్ తో గతేడాది ఆగస్టులో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఉమ్మడి ఒప్పందంలో భాగంగా ఐదేళ్లలోపు ఎప్పుడైనా విమాన ప్రయాణానికి అవకాశం ఉందని టిటో చెప్పాడు. టిటోకు అప్పటికి 87 ఏళ్లు వస్తాయి. ఒకవేళ తన ఆరోగ్యం క్షీణిస్తే మాత్రం ఈ యాత్రను విరమించుకోవాలని చూస్తున్నాడు. కాగా, అంతరిక్షంలోకి వెళ్లిన అతి పెద్ద వయస్కుడిగా అమెరికాకు చెందిన జాన్ గ్లెన్ రికార్డు సృష్టించాడు. 77 ఏళ్లప్పుడు జాన్ గ్లెన్ అంతరిక్షంలోకి వెళ్లాడు. దాన్ని టిటో బ్రేక్ చేసే అవకాశం ఉంది.


More Telugu News