మహిళల ఆసియా కప్​లో ఏడోసారి ఫైనల్​కు దూసుకెళ్లిన భారత్​

  • సెమీస్ లో థాయ్ లాండ్ పై ఘన విజయం
  • సత్తా చాటిన షెఫాలీ, దీప్తి, రాజేశ్వరి
  • 74 పరుగుల తేడాతో చిత్తయిన థాయ్ జట్టు
మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో  ఏడోసారి విజేతగా నిలిచేందుకు భారత జట్టు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఈ టోర్నీలో టీమిండియా ఏడోసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. థాయ్ లాండ్ తో గురువారం జరిగిన సెమీఫైనల్లో 74 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (28 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 42) సత్తా చాటింది. జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 3 ఫోర్లతో 27), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 4 ఫోర్లతో 36) కూడా రాణించారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13) నిరాశ పరిచినా.. రిచా ఘోష్ (2), దీప్తి శర్మ (3) నిరాశ పరిచారు. థాయ్ లాండ్ బౌలర్లలో సిర్నారిన్ తిపోచ్ (3/24) మూడు వికెట్లు పడగొట్టింది. 

అనంతరం 149 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన థాయ్ లాండ్ ఓవర్లన్నీ ఆడి 74/9 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్ చైవాల్ (21), నటాయ (21) మాత్రమే కాసేపు పోరాడారు. ఈ ఇద్దరు తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ  (3/7) నాలుగు ఓవర్లలో ఏడే పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ (2/10) రెండు వికెట్లు పడగొట్టింది. దాంతో, ఈ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ చేరుకున్న థాయ్ లాండ్ అక్కడే తన పోరాటాన్ని ముగించింది. పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ విజేతతో భారత్ శనివారం ఫైనల్లో పోటీ పడుతుంది.


More Telugu News