రేప్ చేస్తామంటూ ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతికి బెదిరింపులు

రేప్ చేస్తామంటూ ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతికి బెదిరింపులు
  • బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ ను షో నుంచి తొలగించాలన్న స్వాతి
  • ఇన్స్టాగ్రామ్ వేదికగా స్వాతికి బెదిరింపులు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు స్వాతి ఫిర్యాదు
మన దేశంలో మహిళలు, బాలికలపై జరిగే అరాచకాలు, అన్యాయాలను ఎదుర్కోవడానికి జాతీయ మహిళా కమిషన్, రాష్ట్రాల మహిళా కమిషన్లు అలుపెరుగని పోరాటం చేస్తుంటాయి. అకృత్యాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతుంటాయి. అలాంటిది ఏకంగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కే బెదిరింపులు వస్తే పరిస్థితి ఏమిటి? తాజాగా ఇదే జరిగింది. రేప్ చేస్తామంటూ ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మళివాల్ కు బెదిరింపులు వచ్చాయి. బిగ్ బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ ను షో నుంచి తొలగించాలని స్వాతి కోరడంతో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. 

వివరాల్లోకి వెళ్తే... సాజిద్ ఖాన్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మీటూ ఉద్యమం సమయంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీటూ ఉద్యమం ఆరోపణలను ఎదుర్కొంటున్న సాజిద్ ను బిగ్ బాస్ షో నుంచి తొలగించాలని కోరుతూ సోమవారం నాడు కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు స్వాతి లేఖ రాశారు. ఆ తర్వాత ఆమెకు ఇన్స్టాగ్రామ్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమె ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదరించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

మరోవైపు మీడియాతో స్వాతి మాట్లాడుతూ... మీటూ బాధితులకు అండగా ఉంటున్నందుకు రేప్ చేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. ఇది మహిళా కమిషన్ ను బెదిరించడం, పని తీరును అడ్డుకోవడమే అవుతుందని అన్నారు. ఈ బెదిరింపులపై ఢిల్లీ పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని... ఇలాంటి క్రిమినల్స్ ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ అయిన తనకే ఇలాంటి బెదిరింపులు వస్తే... మీటూ ఉద్యమంలో గొంతుకను వినిపించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. వినోద పరిశ్రమలో తమ పలుకుబడిని ఉపయోగించుకుని మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే పురుషులను వదిలి పెట్టకూడదని చెప్పారు.


More Telugu News