నా భర్తకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు?: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నరేంద్ర భార్య లేఖ
- టీడీపీ మీడియా కోఆర్డినేటర్ నరేంద్రను అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ
- సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదన్న నరేంద్ర భార్య
- కనీసం బట్టలు వేసుకునే సమయాన్ని కూడా ఇవ్వలేదని ఆవేదన
టీడీపీ కేంద్ర కార్యాలయ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను ఏపీ సీఐడీ అధికారులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గుంటూరులోని తన నివాసంలో ఉన్న నరేంద్రను సీఐడీ అధికారులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నరేంద్ర భార్య సౌభాగ్యం లేఖ రాశారు. తన భర్తను అరెస్ట్ చేసే విషయంలో సీఐడీ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని లేఖలో తెలిపారు. తన భర్త చేసిన నేరం ఏమిటో సీఐడీ అధికారులు చెప్పలేదని అన్నారు. అరెస్ట్ చేసే ముందు 41ఏ నోటీసులు ఇవ్వాలన్న నిబంధనను పట్టించుకోలేదని చెప్పారు. తన భర్తకు కనీసం బట్టలు వేసుకునే సమయాన్ని కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆయనను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలను ఇవ్వాలని కోరారు.