హెల్త్ వ‌ర్సీటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గింపుపై స్పందించేందుకు నిరాక‌రించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ

  • ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌తో భేటీ అయిన వ‌ల్ల‌భ‌నేని వంశీ
  • రైతుల స‌మ‌స్య‌ల‌పై క‌లెక్ట‌ర్‌తో 3 గంట‌ల పాటు స‌మావేశం 
  • ఎన్టీఆర్ పేరు తొల‌గించ‌డం ద్వారా ఆయ‌న‌పై అభిమానం త‌గ్గ‌బోద‌ని వ్యాఖ్య‌
ఏపీలోని ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మార్చిన వైనంపై గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ విచిత్రంగా స్పందించారు. వ‌ర్సిటీ పేరు నుంచి ఎన్టీఆర్ పేరును తొల‌గించ‌డంపై మీ స్పంద‌నేమిటీ అన్న మీడియా ప్ర‌శ్న‌కు వంశీ స‌మాధానాన్ని దాట‌వేశారు. అయితే వ‌ర్సిటీ పేరులో నుంచి ఎన్టీఆర్ పేరును తొల‌గించ‌డంతో ఎన్టీఆర్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానం ఏమీ త‌గ్గ‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో వ‌ర్సిటీ పేరుకు వైఎస్సార్ పేరు జోడించ‌డం వ‌ల్ల కొత్త‌గా పుట్టుకొచ్చే అభిమానం కూడా ఏమీ ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను బుధ‌వారం విజ‌య‌వాడ‌లో వంశీ క‌లిశారు. క‌లెక్ట‌రేట్‌లో దాదాపుగా 3 గంట‌ల పాటు స‌మావేశం నిర్వ‌హించిన వంశీ...రైతుల స‌మ‌స్య‌ల‌పైనే తాను ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపాన‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగానే హెల్త్ వ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొల‌గించ‌డాన్ని మీరు స‌మ‌ర్థిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం దాట‌వేశారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై గ‌న్న‌వ‌రం నుంచి పోటీ చేసి గెలిచిన వంశీ... ఆ త‌ర్వాత వైసీపీకి ద‌గ్గ‌ర‌గా జ‌రిగిన విష‌యం తెలిసిందే.


More Telugu News