ఓటుకు రూ. 10 వేలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు: జీవన్ రెడ్డి

  • రాజగోపాల్ రెడ్డి అహంకారంతోనే ఉప ఎన్నిక వచ్చిందన్న జీవన్ రెడ్డి
  • ఎన్నికల్లో గెలిచి సాధించేది ఏముందని ప్రశ్న
  • గుత్తా రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన నిరంజన్
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో వేడి పుట్టిస్తోంది. అన్ని పార్టీల ప్రధాన నేతలు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం హోరెత్తుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ... బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాజగోపాల్ రెడ్డి అహంకారంతోనే ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. 

శివన్నగూడెం రైతుల కోసం కోమటిరెడ్డి ఏనాడైనా ధర్నా చేశారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఉప ఎన్నికలో గెలిచినా ఎమ్మెల్యేనే అవుతారని... ఆయన సాధించేది ఏముందని అన్నారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ పాల్పడుతోందని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో ఓటుకు రూ. 10 వేలు ఇవ్వడానికి సిద్ధమయ్యాయని అన్నారు. 

మరోవైపు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి టీఆర్ఎస్ కు ఓటు వేయమని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఛైర్మన్ పదవికి గుత్తా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News